PCB will likely appoint a new head coach before starting the next World Test Championship cycle
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాకిస్తాన్ పేలవ ప్రదర్శన చేస్తోంది. వరుసగా న్యూజిలాండ్, భారత్ చేతుల్లో ఓడిపోయింది. ఈ క్రమంలో గ్రూప్ స్టేజీలో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి నిష్ర్కమించింది. ఈ క్రమంలో పాక్ జట్టు పై విమర్శల జడివాన కొనసాగుతోంది. మాజీ ఆటగాళ్లతో పాటు అభిమానులు ఆ జట్టు పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అయినప్పటికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాత్రం ఇంత వరకు పాక్ ప్రదర్శన ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
ఛాంపియన్స్ ట్రోఫీకి పాక్ ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. టోర్నమెంట్ విజయవంతంగా నిర్వహిస్తుండంతో పీసీబీ ఆనందంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో మరిన్ని ఐసీసీ టోర్నీలను నిర్వహించాలని టార్గెట్ పెట్టుకుంది. అందుకనే టోర్నీముగిసే వరకు పాక్ జట్టు పై ఎలాంటి బహిరంగ వ్యాఖ్యలు చేయకూడదని పీసీబీ వర్గాలు నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం పాక్ జట్టుపై వ్యాఖ్యలు చేస్తే అది టోర్నమెంట్ నుంచి ప్రజల దృష్టి మరలే ప్రమాదం ఉందని పీసీబీ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అదే సమయంలో పాక్ ప్రదర్శనను తేలిగ్గా తీసుకోకూడదని పీసీబీ అధికారులు భావిస్తున్నారట. టోర్నీ ముగిసిన తరువాత జట్టులో భారీ మార్పులు చేయబోతున్నట్లుగా చెబుతున్నారు. తాత్కాలిక ప్రధాన కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆకిబ్ జావెద్ పదవికాలం ఫిబ్రవరి 27తో ముగియనుందట.
ఛాంపియన్స్ ట్రోఫీ తరువాత న్యూజిలాండ్ జట్టుతో పాక్ వైట్ బాల్ సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌కు కొత్త కోచ్‌ను నియమించనున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్ రిజ్వాన్ పై వేటు పడే అవకాశం ఉందట.
‘మార్చి 15 నుంచి పాకిస్తాన్ వైట్ బాల్ సిరీస్ కోసం న్యూజిలాండ్ వెళ్ళాలి. తాత్కాలిక హెడ్ కోచ్‌గా ఆకిబ్ జావేద్ ఒప్పందం ఫిబ్రవరి 27న ముగుస్తుంది. ఆ సమయంలో పాకిస్తాన్ బంగ్లాదేశ్‌తో చివరి గ్రూప్ మ్యాచ్ ఆడుతుంది. కాబట్టి.. ఖచ్చితంగా బోర్డు NZ టూర్ కోసం హెడ్ కోచ్‌ను నియమించాల్సి ఉంటుంది. అయితే.. అది పూర్తి స్థాయిలో కాకపోవచ్చు. తాత్కాలికంగా నియమించే అవకాశం ఉంది. ఇప్పటికే పీసీబీ శాశ్వత హెడ్ కోచ్‌ను నియమించే ప్రక్రియను ప్రారంభించింది.’ అని పీసీబీ వర్గాలు తెలిపాయి.