Champions Trophy 2025 : ఆస్ట్రేలియా క్రికెట్‌లో ఏం జరుగుతోంది..? ఓ వైపు ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతుండగానే రిటైర్‌మెంట్ ప్రకటించిన మరో ఆటగాడు..
మరో ఆసీస్ ఆటగాడు వన్డేలకు రిటైర్‌మెంట్ ప్రకటించాడు.

Australia left arm pacer announces retirement
దాదాపు ఐదు నుంచి ఆరుగురు కీలక ఆటగాళ్లు లేకుండానే ఛాంపియన్స్ ట్రోపీ బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు అద్భుత ప్రదర్శన చేస్తోంది. అయినప్పటికి ఆ జట్టుకు ఇబ్బందులు తప్పడం లేదు. తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ పై భారీ లక్ష్యాన్ని ఛేదించింది. అయితే.. దక్షిణాఫ్రికాతో జరగాల్సిన రెండో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. ఇది ఆ జట్టు సెమీస్ అవకాశాల పై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక గ్రూప్ స్టేజీలో ఆస్ట్రేలియా ఫిబ్రవరి 28న తన చివరి మ్యాచ్‌ను ఆడనుంది. శుక్రవారం అఫ్గానిస్తాన్‌తో పోటీపడనుంది. ఈ మ్యాచ్‌కు గడాఫీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది.
ఇలా ఉంటే.. మరో ఆసీస్ ఆటగాడు వన్డేలకు గుడ్ బై చెప్పాడు. ఆ జట్టు స్టార్ పేసర్ జాసన్ బెహ్రెన్‌డార్ఫ్ స్టేట్ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పాడు. తనలో చాలా క్రికెట్ మిగిలి ఉందని చెబుతూనే రిటైర్‌మెంట్ తీసుకున్నాడు. ఈ వెస్ట్రన్ ఆస్ట్రేలియా బౌలర్ తన జట్టు తరుపున లిస్ట్ ఏ క్రికెట్‌లో 75 వికెట్లు, షెఫీల్డ్ షీల్డ్‌లో 126 వికెట్లు పడగొట్టాడు.
స్టేట్ క్రికెట్ ఆడాలనే తన చిన్ననాటి కల అని దాన్ని తాను నిజం చేసుకోగలిగానన్నాడు. ఆస్ట్రేలియా జట్టు తరుపున కొన్ని మ్యాచ్‌లను ఆడే అదృష్టం దక్కిందన్నాడు. తనలో చాలా క్రికెట్ మిగిలి ఉందని చెప్పుకొచ్చాడు. అయితే.. కొంచెం భిన్నమైన దిశలో ప్రయాణం చేయాలనుకుంటున్నానని వెల్లడించాడు. తన కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పుకొచ్చాడు.
Champions Trophy 2025 : వార్నీ.. బంగ్లాదేశ్‌తో ఓడిపోతే.. పాకిస్తాన్‌కు ఎన్ని కోట్ల నష్టమో తెలుసా?
స్వదేశంలో, ప్రపంచవ్యాప్తంగా జరిగే లీగ్‌లలో టీ20 క్రికెట్ ఆడతానని బెహ్రెన్‌డార్ఫ్ స్పష్టం చేశాడు. పెర్త్ స్కార్చర్స్‌ను విడిచిపెట్టిన తర్వాత అతను తదుపరి బిగ్ బాష్ లీగ్ 2025-26లో మెల్‌బోర్న్ రెనెగేడ్స్ తరపున ఆడనున్నాడు. 34 ఏళ్ల ఈ ఆటగాడు మెల్‌బోర్న్ రెనెగేడ్స్‌తో మూడేళ్ల ఒప్పందంపై సంతకం చేశాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో ఓ మోస్తరు ప్రదర్శన..
2017లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో బెహ్రెన్‌డార్ఫ్ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అరంగ్రేటం చేశాడు. ఫిబ్రవరి 2024లో వెస్టిండీస్ పై తన చివరి టీ20 మ్యాచ్ ఆడాడు. మొత్తంగా 17 టీ20 మ్యాచ్‌ల్లో 24.61 సగటుతో 18 వికెట్లు తీశాడు. ఇందులో నాలుగు వికెట్ల ప్రదర్శన సైతం ఉంది. ఇక 12 వన్డేల్లో ఆసీస్‌కు ప్రాతినిధ్యం వహించిన అతడు 35.50 సగటుతో 16 వికెట్లు తీశాడు. 2019 వన్డే ప్రపంచకప్‌లో లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన చేయడం గమనార్హం.
ఇక ఐపీఎల్‌లో 2019, 2023 ఎడిషన్లలో ముంబై ఇండియన్స్ తరపున ఆడాడు. 17 మ్యాచ్‌ల్లో 29.05 సగటుతో 19 వికెట్లు పడగొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో పెద్దగా రాణించకపోవడంతో అతడిని సెలక్టర్లు ఎప్పుడో పక్కన పెట్టారు. పాట్ కమిన్స్, హేజిల్‌వుడ్, మిచెల్ మార్ష్, మార్కస్ స్టోయినిస్ వంటి ఆటగాళ్లు ఛాంపియన్స్ ట్రోఫీకి దూరం కావడంతో బెహ్రెన్‌డార్ఫ్ ఈ మెగాటోర్నీలో చోటు దక్కించుకుంటాడని భావించారు. అది జరగలేదు. ఈ క్రమంలోనే అతడు వన్డేలకు రిటైర్‌మెంట్ ప్రకటించినట్లుగా తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఫిబ్రవరి 6న స్టార్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్ వన్డేలకు రిటైర్‌మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.