IND vs NZ : వర్షం కారణంగా భారత్, న్యూజిలాండ్ మ్యాచ్ రద్దైతే.. పరిస్థితి ఏంటి? సెమీస్‌లో ఎవరికి లాభం ?
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయితే ఏం జరుగుతుందంటే..

what happens if IND vs NZ match gets abandoned due to rain in Champions Trophy 2025
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. గ్రూప్-ఏ నుంచి భారత్, న్యూజిలాండ్ జట్లు ఇప్పటికే సెమీస్‌కు చేరుకున్నాయి. అటు గ్రూప్-బిలో సెమీస్ రేసు ఆసక్తికరంగా మారింది. మంగళవారం దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. మ్యాచ్ నిర్వహించే పరిస్థితులు లేకపోవడంతో కనీసం టాస్‌ను కూడా వేయకుండానే మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో ఇరు జట్లకు ఒక్కొ పాయింట్‌ను కేటాయించారు.
ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో గ్రూప్-బిలో అన్ని జట్లు కూడా సెమీస్ రేసులోకి వచ్చాయి. ఇంగ్లాండ్, అఫ్గానిస్తాన్ జట్ల మధ్య నేడు జరిగే మ్యాచ్ ఇరు జట్లకు డూ ఆర్ డైగా మారింది. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి నిష్ర్కమించిన మూడో జట్టుగా నిలుస్తుంది. ఇప్పటికే గ్రూప్-ఏ నుంచి పాకిస్తాన్, బంగ్లాదేశ్ లు నిష్ర్కమించిన సంగతి తెలిసిందే.
వర్షం కారణంగా భారత్, న్యూజిలాండ్ మ్యాచ్ రద్దు అయితే..
గ్రూప్ స్టేజీలో భారత్, న్యూజిలాండ్ జట్లు తమ చివరి మ్యాచ్‌ను మార్చి 2న ఆడనున్నాయి. ఇరు జట్లు సెమీస్‌కు చేరిన నేపథ్యంలో ఈ మ్యాచ్ నామమాత్రంగా మారింది. అయితే.. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు టేబుల్ టాపర్‌గా సెమీస్‌లో అడుగుపెట్టనుంది. దుబాయ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌ను ఇరు జట్లు తేలికగా తీసుకోవడం లేదు. ఈ క్రమంలో ఈ మ్యాచ్‌లో వర్షం పడి రద్దు అయితే పరిస్థితి ఏంటో ఓ సారి చూద్దాం.
ప్రస్తుతం పాయింట్ల పట్టికను చూస్తే.. గ్రూప్-ఏ నుంచి న్యూజిలాండ్ అగ్రస్థానంలో ఉంది. భారత్ రెండో స్థానంలో ఉంది. ఇరు జట్లు కూడా నాలుగు పాయింట్లతో సమానంగా ఉన్నప్పటికి భారత్ (+0.647) నెట్‌రన్‌రేట్ కంటే న్యూజిలాండ్ (+0.863) నెట్‌రన్‌రేట్ మెరుగ్గా ఉంది. దీంతో కివీస్ అగ్రస్థానంలో ఉంది. ఇక భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయితే.. అప్పుడు ఇరు జట్లకు ఒక్కొ పాయింట్‌ను కేటాయిస్తారు. అప్పుడు పాయింట్ల పట్టికలో ఎలాంటి మార్పు ఉండదు. ఇరు జట్లు 5 పాయింట్లతో నిలుస్తాయి. మెరుగైన నెట్‌రన్‌రేట్ కలిగిన కివీస్ టీమ్ టేబుల్ టాపర్‌గా, భారత్ రెండో స్థానంతో సెమీస్‌లో అడుగుపెడతాయి.
ఛాంపియన్స్ ట్రోఫీ నిబంధనల ప్రకారం.. గ్రూప్-ఏలో టేబుల్ టాపర్ ఉన్న జట్టు గ్రూప్-బిలో రెండో స్థానంలో నిలిచిన జట్టుతో అదేవిధంగా గ్రూప్-ఏలో రెండో స్థానంలో ఉన్న జట్టు గ్రూప్-బిలో టేబుల్ టాపర్‌గా ఉన్న జట్టుతో ఆడాల్సి ఉంటుంది.
Champions Trophy 2025 : వార్నీ.. బంగ్లాదేశ్‌తో ఓడిపోతే.. పాకిస్తాన్‌కు ఎన్ని కోట్ల నష్టమో తెలుసా?
ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీఫైనల్స్, ఫైనల్‌కు మాత్రమే రిజర్వ్ డే లు ఉన్నాయి. అయితే.. దుబాయ్‌లో ప్రస్తుతం ఎండాకాలం కావడంతో అక్కడ వర్షాలు పడే అవకాశం లేదు. దీంతో భారత్, కివీస్ మ్యాచ్ వర్షం పడి రద్దు అయ్యే అవకాశం దాదాపుగా లేనట్లే.