Premier Handball League : ప్రతీకారం తీర్చుకున్న తెలుగు టాలన్స్.. అగ్రస్థానానికి చేరిక
ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ లో తెలుగు టాలన్స్ సత్తా చాటుతోంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.

DP vs TT
Premier Handball League 2023: ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ లో తెలుగు టాలన్స్ సత్తా చాటుతోంది. వరుసగా రెండు విజయాలతో టోర్నీని ఆరంభించిన టాలన్స్ ఆ తరువాత రెండు ఓటములను చవిచూసింది. అయితే.. మళ్లీ రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ ఇండోర్ స్టేడియంలో గురువారం ఢిల్లీ పాంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తెలుగు టాలన్స్ 26-23తో తేడాతో విజయం సాధించింది.
ఈ సీజన్‌లో ఆరంభంలో ఢిల్లీ పాంజర్స్ చేతిలో ఓడిపోయిన టాలన్స్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సాధించి ప్రతీకారం తీర్చుకుంది. మొత్తంగా ఇప్పటి వరకు ఈ సీజన్‌లో ఆరు మ్యాచులు ఆడిన తెలుగు టాలన్స్ నాలుగు మ్యాచుల్లో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత 0-2తో టాలన్స్ వెనుకబడింది. కాగా టాలన్స్ స్టార్ ఆటగాళ్లు దేవిందర్ సింగ్ భుల్లార్, నసీబ్, రఘు మెరవటంతో 5-3తో ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది.
Premier Handball League: తెలుగు టాలన్స్ ఘన విజయం

dp vs tt key moments
ప్రథమార్థం ముగిసే సరికి టాలన్స్ 13-10తో ముందంజలో నిలిచింది. అయితే..ద్వితీయార్థం ఆరంభంలోనే వరుస గోల్స్ నమోదు చేసిన ఢిల్లీ పాంజర్స్ 12-13తో పుంజుకునేందుకు గట్టిగానే ప్రయత్నం చేసింది. టాలన్స్ గోల్‌కీపర్ రాహుల్ గోల్స్‌ను సమర్థవంతంగా అడ్డుకోవడంతో పాంజర్స్ అవకాశాలు ఆవిరి అయ్యాయి. రాహుల్ ఏకంగా 20 గోల్ ప్రయత్నాలను నిలువరించటంలో విజయవంతం అయ్యాడు. చివరికి టాలన్స్ 26-23తో మూడు గోల్స్ వ్యత్యాసంతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. టాలన్స్ తన తదుపరి మ్యాచ్‌ను శనివారం రాజస్తాన్‌తో ఆడనుంది.
Premier Handball League: పోరాడి ఓడిన తెలుగు టాలన్స్.. వరుసగా రెండో ఓటమి.. ఇలా అయితే కష్టమే..!