President Droupadi Murmu on Vinesh Phogat Disqualification
Vinesh Phogat : ఒలింపిక్స్‌లో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ పై అనర్హత వేటు పడింది. ఫైనల్ బౌట్‌లో స్వర్ణ పతకం సాధిస్తుందన్న ఆశతో ఎదురుచూస్తున్న ఎంతో మంది భారతీయులకు ఈ వార్త షాక్‌కు గురి చేసింది. ఈ క్రమంలో ఎంతో మంది ప్రముఖులు వినేశ్‌కు అండగా నిలుస్తున్నారు. వినేశ్ ఫొగట్‌కు అందరూ అండగా నిలవాలని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కోరారు. 140 కోట్ల ప్రజల హృదయాల్లో ఫొగట్ ఛాంపియన్‌గా నిలిచారన్నారు.
‘పారిస్ ఒలింపిక్స్‌లో వినేశ్ ఫొగట్ అసాధారణ ప్రతిభ కనబరిచారు. తన ప్రతిభతో దేశం గర్వపడేలా చేశారు. ఈ సమయంలో ఫొగట్‌కు అందరూ అండగా నిలవాలి. 140 కోట్ల ప్రజల హృదయాల్లో ఫొగట్ ఛాంపియన్‌గా నిలిచారు. భవిష్యత్తు క్రీడాకారులకు ఆమె ఆదర్శంగా నిలుస్తారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని అవార్డులు సాధించాలని కోరుకుంటున్నా.’ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.
Vinesh Phogat : నిబంధనలు ఇవే.. వినేశ్ ఫోగట్ స్థానంలో ఫైనల్‌కు వెళ్లేది ఆమెనే..?
“వినేశ్ ఫోగట్ పై అనర్హత వేటు వేయడం షాకింగ్‌గా ఉంది. కొద్దిసేపటి క్రితమే ఒలింపిక్ క్రీడాగ్రామంలోని పాలీక్లినిక్‌లో ఆమెను కలిశాను. భారత ఒలింపిక్ సంఘం, భారత ప్రభుత్వం, దేశం మొత్తం ఆమెకు అండగా ఉందని హామీ ఇచ్చాను. వినేశ్‌కు వైద్యపరంగా, భావోద్వేగపరంగా సాయం అందిస్తున్నాం. అనర్హత వేటు విషయాన్ని రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా.. ‘యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్’ దృష్టికి తీసుకెళ్లింది.” అని భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష తెలిపింది.
అనర్హత వేటుపై లోక్‌సభలో కేంద్ర మంత్రి వివరణ..
ఒలింపిక్స్‌లో ఫొగట్‌పై అనర్హత వేటుపై కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ లోక్‌సభలో వివరణ ఇచ్చారు. ఫొగట్ నిర్దేశిత బరువు కంటే వంద గ్రాములు ఎక్కువ ఉండడంతో రెజ్లింగ్ 50 కేజీల విభాగం ఫైనల్ నుంచి వైదొలగాల్సి వచ్చిందన్నారు. ఫొగట్ గతంలో అనేక విజయాలు సాధించారన్నారు. ఈ సమయంలో ఆమెకు అన్ని రకాలుగా అండగా ఉంటామన్నారు. ఈ వ్యవహారం పై యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ వద్ద భారత ఒలింపిక్ సంఘం తీవ్ర నిరసన వ్యక్తం చేసినట్లుగా చెప్పారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషను ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారు.