PSL : చిన్నా నువ్వు మాత్రం గ్రౌండ్‌లోకి రాకు.. వ‌చ్చావో బ్యాట‌ర్ల వెన్నులో వ‌ణుకే..!

ఓ బాల్‌బాయ్‌ ప‌ట్టిన అద్భుత క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Pakistan Super League : క్రికెట్‌లో క్యాచెస్ విన్ మ్యాచెస్ అనే ఓ నానుడి ఉంది. ఒక్క క్యాచ్ మిస్ చేసినా అది ఆ జ‌ట్టు గెలుపోట‌ముల‌పై ప్ర‌భావం చూపిస్తూ ఉంటుంది. మైదానంలోని ఫీల్డ‌ర్లు ఎన్నో అద్భుత‌మైన విన్యాసాలు చేయ‌డాన్ని చూస్తూనే ఉంటాం. అయితే.. బౌండ‌రీ లైన్ బ‌య‌ట ఓ బాల్‌బాయ్‌ ప‌ట్టిన అద్భుత క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇది పాకిస్తాన్ సూప‌ర్ లీగ్ (పీఎస్ఎల్‌)లో చోటు చేసుకుంది.

పీఎస్ఎల్ 2024 సీజ‌న్‌లో భాగంగా సోమ‌వారం ఇస్లామాబాద్ యునైటెడ్, పెషావర్ జల్మీ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్‌లో ఇస్లామాబాద్ యునైటెడ్ జ‌ట్టు మొద‌ట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్లు న‌ష్ట‌పోయి 196 ప‌రుగులు చేసింది. ఇస్లామాబాద్ బ్యాట‌ర్ల‌లో షాదాబ్ ఖాన్ (80; 51 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స‌ర్లు) అర్ధ‌శ‌త‌కం చేశాడు. అజామ్ ఖాన్ (29; 14 బంతుల్లో 4 ఫోర్లు, 1సిక్స్‌) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. పెషావర్ జల్మీ బౌల‌ర్ల‌లో అయూబ్ రెండు వికెట్లు తీయ‌గా, లూక్ వుడ్‌, సల్మాన్ ఇర్షాద్ లు చెరో వికెట్ సాధించారు.

క్రికెట్ అభిమానుల‌కు గుడ్‌న్యూస్‌‌.. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్‌లు మీ ఫోన్లో ఉచితంగా చూడొచ్చు.. ఎలా అంటే?

అనంత‌రం ల‌క్ష్య ఛేద‌న‌లో పెషావర్ జల్మీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో తొమ్మిది వికెట్లు కోల్పోయి 167 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. పెషావ‌ర్ జ‌ల్మీ బ్యాట‌ర్ల‌లో అమీర్ జమాల్ (87; 49 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స‌ర్లు) దూకుడుగా ఆడిన మిగిలిన వారు దారుణంగా విఫ‌లం అయ్యారు. దీంతో 29 ప‌రుగుల తేడాతో ఓట‌మిపాలైయ్యారు. ఇస్లామాబాద్ బౌల‌ర్ల‌లో కెప్టెన్ షాదాబ్ ఖాన్ మూడు వికెట్లు తీశాడు. రుమ్మన్ రయీస్, హునైన్ షా లు చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. నసీమ్ షా ఓ వికెట్ సాధించాడు.

బాల్ బాయ్ సెన్సేషనల్ క్యాచ్..

ల‌క్ష్య‌ఛేద‌న‌లో పెషావ‌ర్ జ‌ల్మీ ఇన్నింగ్స్ 19వ ఓవ‌ర్‌లో బాల్‌బాయ్ ప్రొఫెన‌ల్ క్రికెట‌ర్ల‌ను త‌ల‌పిస్తూ అద్భుత క్యాచ్ అందుకున్నాడు. రుమ్మన్ రయీస్ 19వ ఓవ‌ర్ ను వేశాడు. ఈ ఓవ‌ర్‌లోని ఐదో బంతిని ఆరిఫ్ యాకూబ్ డీప్ బ్యాక్‌వ‌ర్డ్ స్క్వేర్ లెగ్ మీదుగా సిక్స్‌గా మ‌లిచాడు. అక్క‌డే ఫీల్డింగ్ చేస్తున్న కొలిన్ మ‌న్రో క్యాచ్ అందుకోవ‌డానికి వెళ్లాడు. కానీ బంతి బౌండ‌రీ లైన్ ను దాటింది.

కాగా.. అక్క‌డే ఉన్న బాల్‌బాయ్ సైతం మ‌న్రోకు స‌మాంత‌రంగా క్యాచ్‌కు ట్రై చేశాడు. ప్రొఫెన‌ల్ క్రికెట‌ర్ల‌ను త‌ల‌పిస్తూ డైవ్ చేస్తూ క్యాచ్ అందుకున్నాడు. ఆ క్యాచ్‌ను చూసి ఫిదా అయిన కొలిన్ మన్రో బాల్‌బాయ్‌ను హగ్ చేసుకుని మెచ్చుకున్నాడు. మంచి క్యాచ్ అందుకోవ‌డంతో బాల్‌బాయ్ సంబ‌రాలు చేసుకోగా అందులో మ‌న్రో సైతం భాగం అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియోను పీఎస్ఎల్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా అది వైర‌ల్‌గా మారింది. నువ్వుగానీ మైదానంలోకి వ‌స్తే బ్యాట‌ర్ల వెన్నులో వ‌ణుకు పుట్టాల్సిందే అని ఒక‌రు, మ‌రో జాంటీ రోడ్స్ అని ఇంకొక‌రు ఇలా నెటిజ‌న్లు కామెంట్ల‌తో హోరెత్తిస్తున్నారు.

Viral Video : బౌల‌ర్‌పై వికెట్ కీప‌ర్‌కు ప‌గ‌? బాక్స్ బ‌ద్ద‌లైందిగా!

ట్రెండింగ్ వార్తలు