Pro Kabaddi League : ఫైనల్లో పుణెరి పల్టాన్‌.. సెమీస్‌లో పట్నా పైరేట్స్‌పై 37-21తో గెలుపు

Pro Kabaddi League 10 Season : గచ్చిబౌలిలోని జిఎంసీ బాలయోగి ఇండోర్‌ స్టేడియంలో జరిగిన సెమీఫైనల్లో మూడు సార్లు చాంపియన్‌ పట్నా పైరేట్స్‌పై పుణెరి పల్టాన్‌ 37-21తో ఘన విజయం సాధించింది.

Pro Kabaddi League 10 Season

Pro Kabaddi League 10 Season : పుణెరి పల్టాన్‌ ప్రొ కబడ్డీ లీగ్‌ పదో సీజన్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం (ఫిబ్రవరి 28) గచ్చిబౌలిలోని జిఎంసీ బాలయోగి ఇండోర్‌ స్టేడియంలో జరిగిన సెమీఫైనల్లో మూడు సార్లు చాంపియన్‌ పట్నా పైరేట్స్‌పై పుణెరి పల్టాన్‌ 37-21తో ఘన విజయం సాధించింది. గ్రూప్‌ దశలో అగ్రస్థానంలో నిలిచిన పుణెరి పల్టాన్‌ సెమీఫైనల్లోనూ అదే జోరు చూపించింది.

పుణెరి పల్టాన్‌ ఆటగాళ్లలో అస్లాం ఇనాందార్‌ (7), పంకజ్‌ మోహిత్‌ (7) రాణించారు. పట్నా పైరేట్స్‌ తరఫున సచిన్‌ (5), మంజిత్‌ (4) మెరిసినా.. ఆ జట్టుకు పరాజయం తప్పలేదు. ప్రొ కబడ్డీ లీగ్‌లో రెండోసారి టైటిల్‌ పోరుకు చేరుకున్న పుణెరి పల్టాన్‌.. శుక్రవారం జరిగే ఫైనల్లో రెండో సెమీఫైనల్‌ విజేతతో తలపడనుంది.

Read Also : Ishan Kishan : రీ ఎంట్రీలో తుస్‌మ‌న్న ఇషాన్ కిష‌న్.. ఇంకా కోలుకోలేదా?

తొలి టైటిల్‌ కోసం ఎదురుచూస్తున్న జట్టు పుణెరి పల్టాన్‌. మూడు సార్లు చాంపియన్‌ పట్నా పైరేట్స్‌. గణాంకాలు, నాకౌట్‌ మ్యాచుల్లో నెగ్గిన అనుభవం పట్నా పైరేట్స్‌లో ఆత్మవిశ్వాసం నింపినా.. గ్రూప్‌ దశలో అగ్రస్థానంలో నిలిచిన పుణెరి పల్టాన్‌ అవేవీ పట్టించుకోలేదు. గ్రూప్‌ దశ జోరు, ఉత్సాహం సెమీఫైనల్లోనూ కొనసాగించింది. తొలి రెయిడ్‌లోనే అస్లాం ఇనాందార్‌ పాయింట్‌ తీసుకొచ్చి పుణెరి పల్టాన్‌ పాయింట్ల ఖాతా తెరిచాడు. అస్లాం ఇనాందార్‌కు పంకజ్‌ మోహిత్‌ సైతం జతకలవటంతో పుణెరి పల్టాన్‌ దూసుకెళ్లింది. ప్రథమార్థం ఆట ముగిసే సమయానికి 20-11తో 9 పాయింట్ల భారీ ముందంజలో నిలిచింది.

puneri Paltan 

పుణెరి పల్టాన్‌ దూకుడుగా ఆడుతూ :
సెకండ్ హాఫ్‌లో పట్నా పైరేట్స్‌ పుంజుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆ జట్టు తరఫున స్టార్‌ రెయిడర్‌ సచిన్‌ నాలుగుసార్లు మాత్రమే కూతకెళ్లి పాయింట్లు తీసుకొచ్చాడు. డిఫెండర్‌ మంజిత్‌ సైతం కూతకెళ్లి నాలుగు పాయింట్లే సాధించాడు. డిఫెండర్‌ సందీప్‌ కుమార్‌ (మూడు ట్యాకిల్స్‌) సైతం అంచనాలను అందుకోలేదు. మరోవైపు పుణెరి పల్టాన్‌ సమిష్టి ప్రదర్శనతో ఆద్యంతం ఆధిక్యంలో కొనసాగించింది. మోహిత్‌ గోయత్‌ కండ్లుచెదిరే డూ ఆర్‌ డై రెయిడ్‌లో మెరవటంతో పుణెరి పల్టాన్‌ మరింత దూకుడు ప్రదర్శించింది. దీంతో 37-21తో భారీ తేడాతో పట్నా పైరేట్స్‌పై విజయం సాధించింది. ప్రొ కబడ్డీ లీగ్‌లో రెండోసారి టైటిల్‌ పోరుకు చేరుకుంది.

తొలి సెమీఫైనల్లో పుణెరి పల్టాన్‌ రెయిడింగ్‌లో 19 పాయింట్లు సాధించగా, పట్నా పైరేట్స్‌ 16 పాయింట్లు దక్కించుకుంది. డిఫెన్స్‌లో పుణెరి పల్టాన్‌ తిరుగులేని ఆధిపత్యం చూపించింది. పుణెరి పల్టాన్‌ 13 ట్యాకిల్‌ పాయింట్లు ఖాతాలో వేసుకోగా.. పట్నా పైరేట్స్‌ మాత్రం 4 ట్యాకిల్‌ పాయింట్లతో సరిపెట్టుకుంది. పుణెరి పల్టాన్‌ రెయిడర్ల దూకుడుతో రెండు సార్లు పట్నా పైరేట్స్‌ ఆలౌట్‌ అయ్యింది.

Read Also : BCCI Central Contracts: పాపం.. తెలుగు కుర్రాడు హనుమ విహారి సహా ఆరుగురికి చోటు దక్కలేదు..