Quinton de Kock Comments after South Africa defeat india in 2nd T20
Quinton de Kock : ముల్లాన్‌పూర్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైంది. 51 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా ఎక్కడ పొరపాటు చేసింది ? పిచ్ ఎలా స్పందించి వంటి విషయాలను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్న అనంతరం దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు క్వింటన్ డికాక్ వెల్లడించాడు.
ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బ్యాటర్లలో క్వింటన్ డికాక్ (90; 46 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లు) మెరుపులు మెరపించాడు. డోనోవన్ ఫెరీరా (30నాటౌట్; 16 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లు), డేవిడ్ మిల్లర్ (20నాటౌట్; 12 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) వేగంగా ఆడాడు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్ ఓ వికెట్ సాధించాడు.
అనంతరం 214 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత జట్టు 19.1 ఓవర్లలో 162 పరుగులకే కుప్పకూలింది. టీమ్ఇండియా బ్యాటర్లలో తిలక్ వర్మ (62; 34 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్థశతకంతో రాణించాడు. మిగిలిన వారిలో అభిషేక్ శర్మ (17; 8 బంతుల్లో 2 సిక్సర్లు), జితేశ్ శర్మ (27; 17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (20; 23 బంతుల్లో 1 సిక్స్) పర్వాలేదనిపించారు. శుభ్‌మన్ గిల్ డకౌట్ కాగా.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (5), శివమ్ దూబె (5) ఘోరంగా విఫలం అయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఓట్నెయిల్ బార్ట్‌మాన్ నాలుగు వికెట్లు తీశాడు. లుథో సిపమ్లా, మార్కో జాన్సెన్, లుంగి ఎంగిడి తలా రెండు వికెట్లు తీశారు.
కీలక ఇన్నింగ్స్ ఆడిన డికాక్ మ్యాచ్ అనంతరం మాట్లాడాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో పిచ్ పూర్తిగా మారిపోయిందన్నాడు. తాము బ్యాటింగ్ చేసేటప్పుడు బంతి నెమ్మదిగా వచ్చిందని, తక్కువ సీమ్ ఉందన్నాడు. ఇక భారత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పిచ్ పూర్తిగా మారిపోయిందని తెలిపాడు. పిచ్ పై వేగం పెరిగిందని, సీమ్ చాలా ఎక్కువగా ఉందన్నాడు. రెండు ఇన్నింగ్స్‌లలో పరిస్థితుల మధ్య ఉన్న అసలు తేడా ఇదేనని తెలిపాడు. ఇక టీమ్ఇండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడం వ్యూహాత్మక తప్పిదం అని డికాక్ అభిప్రాయపడ్డాడు.
తాను క్రీజులో కుదురుకున్నప్పుడు పూర్తిగా సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నస్తానని చెప్పుకొచ్చాడు. పక్కన ఉండే బ్యాటర్‌తో తరుచుగా మాట్లాడుతూ ఉంటాను. అందుకనే అలాంటి ఇన్నింగ్స్‌లు ఆడతానేమో అని అతడు అన్నాడు. తన బ్యాటింగ్ పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు.