ILT 20 : బ్యాట‌ర్‌ను స్టంపౌట్ చేసేందుకు నిరాక‌రించిన నికోల‌స్ పూర‌న్.. ప్ర‌త్య‌ర్థి మాస్ట‌ర్ ప్లాన్‌.. తాడిని త‌న్నేవాడు ఉంటే..

ఇంటర్నేషనల్ లీగ్ టీ20 టోర్న‌మెంట్‌లో (ILT 20) ఓ ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న‌ చోటు చేసుకుంది.

ILT 20 : బ్యాట‌ర్‌ను స్టంపౌట్ చేసేందుకు నిరాక‌రించిన నికోల‌స్ పూర‌న్.. ప్ర‌త్య‌ర్థి మాస్ట‌ర్ ప్లాన్‌.. తాడిని త‌న్నేవాడు ఉంటే..

ILT 20 Nicholas Pooran Refuses To Stump Batter

Updated On : December 10, 2025 / 1:21 PM IST

ILT 20 : సాధార‌ణంగా క్రికెట్‌లో బ్యాట‌ర్‌ క్రీజు దాట‌గానే మెరుపు వేగంతో వికెట్ కీప‌ర్ స్టంపౌట్ చేయ‌డాన్ని చూస్తూనే ఉంటాం. అయితే.. వెస్టిండీస్ స్టార్ ఆట‌గాడు, వికెట్ కీప‌ర్ అయిన నికోల‌స్ పూర‌న్ మాత్రం ఓ బ్యాట‌ర్ ను స్టంపౌట్ చేసేందుకు నిరాక‌రించాడు. స‌ద‌రు బ్యాటర్ క్రీజు దాటి చాలా దూరం వెళ్లగా.. బంతి పూర‌న్ చేతుల్లో ప‌డింది. స్టంపౌట్ చేసేందుకు చాలా స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికి కూడా పూర‌న్ అలా చేయ‌లేదు. బంతిని బౌల‌ర్‌కు అందించాడు. ఔట్ కాకుండా బ‌తికిపోయిన బ్యాట‌ర్ చాలా నెమ్మ‌దిగానే క్రీజులో త‌న బ్యాట్‌ను పెట్ట‌డం గ‌మ‌నార్హం. ఈ ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న ఇంటర్నేషనల్ లీగ్ టీ20 టోర్న‌మెంట్‌లో చోటు చేసుకుంది.

అస‌లేం జ‌రిగిందంటే..?

మంగ‌ళ‌వారం ఎంఐ ఎమిరేట్స్, డెసర్ట్ వైపర్స్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్‌లో వైప‌ర్స్ జ‌ట్టు తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఇన్నింగ్స్ 16వ ఓవ‌ర్‌ను ర‌షీద్ ఖాన్ వేశాడు. ఈ ఓవ‌ర్‌లోని చివ‌రి బంతికి వైప‌ర్స్ బ్యాట‌ర్ మాక్స్ హోల్డెన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్నాడు. ర‌షీద్ బంతిని వేస్తున్న క్ర‌మంలో మాక్స్ క్రీజు దాటి ముందుకు వ‌చ్చాడు. దీన్ని గ‌మ‌నించిన ర‌షీద్ బంతిని కాస్త దూరంగా విసిరాడు.

IND-W vs SL-W : శ్రీలంక‌తో టీ20 సిరీస్‌.. భారత మహిళా జట్టు ఇదే.. ఇద్ద‌రు తెలుగ‌మ్మాయిల‌కు చోటు

బంతి ని మాక్స్ మిస్ చేయ‌గా వికెట్ కీప‌ర్ పూర‌న్ చ‌క్క‌గా అందుకున్నాడు. బ్యాట‌ర్ ను స్టంపౌట్ చేసేందుకు మంచి ఛాన్స్ ఉన్న‌ప్ప‌టికి కూడా పూర‌న్ అలా చేయ‌లేదు. బాల్‌తో ఆడుకుంటూ బౌల‌ర్‌కు విసిరేశాడు. స్టంపౌట్ అయ్యాన‌ని అనుకున్న బ్యాట‌ర్ పూర‌న్ అలా చేయ‌క‌పోవ‌డంతో బ‌తుకు జీవుడా అనుకుంటూ క్రీజులో బ్యాట్‌ను పెట్టాడు. ఈ బంతిని అంపైర్ వైడ్‌గా ప్ర‌క‌టించ‌గా త‌రువాతి బంతికి ప‌రుగులు ఏమీ రాలేదు. ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్ అవుతోంది.

ఇక్క‌డ పూర‌న్ స్టంపౌట్ చేయ‌క‌పోవ‌డానికి ఓ కార‌ణం ఉంది. అప్ప‌టికి మాక్స్ ప‌రుగులు చేసేందుకు తీవ్రంగా ఇబ్బందులు ప‌డుతున్నాడు. 37 బంతుల్లో 42 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. దీంతో అత‌డు బంతులు వృథా చేస్తే అది త‌మ టీమ్‌కు అడ్వాంటేజ్‌గా మారుతుంద‌ని పూర‌న్ ఆలోచించాడు.

వైప‌ర్స్ సూప‌ర్ కౌంట‌ర్‌..

ఇక ఈ విష‌యాన్ని ప‌సిగ‌ట్టిన వైప‌ర్స్‌.. ఆ ఓవ‌ర్ పూర్తి కాగానే మాక్స్ హోల్డెన్ రిటైర్డ్ ఔట్‌గా పెవిలియ‌న్‌కు ర‌మ్మ‌ని చెప్పింది. అత‌డు అలాగే చేశాడు.

IND vs SA : తొలి టీ20 మ్యాచ్‌లో ఘోర ఓట‌మి.. ‘మేమేందుకు ఓడిపోయామంటే..’ ద‌క్షిణాఫ్రికా కెప్టెన్ మార్‌క్ర‌మ్ కామెంట్స్..

ఇక ఈ మ్యాచ్‌లో ఇంకా ఆసక్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఆఖ‌రి వ‌ర‌కు ఉత్కంఠ‌గా సాగిన ఈ మ్యాచ్‌లో వైప‌ర్స్ ఒక్క ప‌రుగు తేడాతో గెలిచింది.

తొలుత బ్యాటింగ్ చేసిన వైప‌ర్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 159 ప‌రుగులు చేసింది. వైప‌ర్స్ బ్యాట‌ర్ల‌లో మాక్స్ హోల్డెన్ (42) నే టాప్ స్కోర‌ర్‌. ఫ‌ఖ‌ర్ జ‌మాన్ (35) రాణించాడు. ఆ త‌రువాత 160 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఎంఐ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 158 ప‌రుగుల‌కు ప‌రిమిత‌మైంది. ఎంఐ బ్యాట‌ర్ల‌లో నికోల‌స్ పూర‌న్ (31), టామ్ బాంటన్ (34)లు రాణించారు.