విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ వంటి దిగ్గజ ఆటగాళ్లు ఛత్తీస్‌గడ్‌లోని గరియాబంద్ జిల్లాలోని మడగావ్ గ్రామానికి చెందిన మనీష్ బిసి అనే కుర్రాడికి కాల్స్ చేశారు. అయితే.. ఆ విషయం సదరు కుర్రాడికి తెలియదు. తనను ఎవరో ఆట పట్టిస్తున్నారని భావించిన అతడు చాలా సరదాగా వారితో మాట్లాడాడు. అసలు దిగ్గజ క్రికెటర్లు అందరూ సదరు కుర్రాడికి వరుస పెట్టి కాల్స్ ఎందుకు చేశారో తెలుసా? అది ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ నంబర్ కావడమే. అయితే.. రజత్ నంబర్ ఆ కుర్రాడి దగ్గరికి ఎలా వచ్చింది? అసలు ఏం జరిగింది? వంటి విషయాలను చూద్దాం..
మనీష్ బిసి అనే కుర్రాడు జూన్ 8న స్థానికంగా ఉన్న ఓ మొబైల్ షాప్‌కు వెళ్లి ఓ జియో సిమ్ ను కొనుగోలు చేశాడు. ఆ తరువాత సిమ్‌ను తన ఫోన్‌లో వేసుకుని యాక్టివేట్ చేసుకున్నాడు. అనంతరం వాట్సాప్ ఇన్‌స్టాల్ చేసుకోగా.. ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ ఫోటో డీపీగా వచ్చింది. అయితే.. అది సాంకేతిక తప్పిందంతో జరిగిందిగా అతడు భావించాడు.
అతడు ఫోన్‌ను వాడుతుండగా.. ఆర్‌సీబీ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, డివిలియర్స్, యశ్ దయాల్ వంటి క్రికెటర్ల నుంచి మనీష్‌కు ఫోన్లు రావడం మొదలు అయ్యాయి. అయితే.. మనీష్ మాత్రం తనకు తెలిసిన వాళ్లే తనను ఏడిపించడం కోసం అలా చేస్తున్నారని భావించాడు. తన స్నేహితుడు ఖేమ్‌రాజ్‌తో కూడా మాట్లాడించాడు.
ఇక ఒక రోజు ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ అతడికి ఫోన్ చేశాడు. అతడితోనూ మనీష్ చాలా సరదాగా, జోకులు వేస్తూ మాట్లాడాడు. అది తన సిమ్ అని తనకు ఇచ్చేయాలని పాటిదార్ అన్నాడు. మనీష్, అతడి స్నేహితుడు ఇది ఫ్రాంక్ అని భావించి సరదాగా మాట్లాడడంతో పాటిదార్ సీరియస్ అయ్యాడు.
ఆ నంబర్ రజత్ పాటిదార్ దే కానీ..
వాస్తవానికి మనీష్ తీసుకున్న నంబర్ ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ ది. అయితే.. టెలికాం నిబంధనల ప్రకారం కొద్ది రోజులు (90 రోజుల పాటు పనిచేయకపోవడం) అతడు ఆ సిమ్‌ను ఉపయోగించకపోవడంతో అది డియాక్టివేట్ అయింది. ఆ సిమ్‌నే మనీష్‌కు కేటాయించారు. ఈ విషయం తెలియని క్రికెటర్లు.. అది రజత్ నంబరే అని భావించి మనీశ్‌కు కాల్ చేశారు.
విషయాన్ని రజత్ పాటిదార్ పోలీసుల దృష్టికి తీసుకుని వచ్చాడు. ఓ బృందం మనీశ్ వద్దకు వెళ్లింది. అతడి అంగీకారంతో తిరిగి ఆ సిమ్‌ను పాటిదార్‌కు అందజేశారు. అసలు విషయం తెలుసుకున్న మనీష్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తాను మాట్లాడింది కోహ్లీ, డివిలియర్స్ వంటి ఆటగాళ్లతో అని ఆలస్యంగా గ్రహించిన అతడు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశాడు. కోహ్లీతో జీవితంలో మాట్లాడుతానని ఒక్కసారి కూడా అనుకోలేదని, డివిలియర్స్ కాల్ చేసి ఇంగ్లీష్‌లో మాట్లాడాడు అని తనకు ఏమీ అర్థం కాలేదన్నాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మనీష్ చాలా లక్కీ అని ఆర్‌సీబీ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.