Ranji Trophy Prithvi Shaw Scripts History With 141 Ball Double Century
Prithvi Shaw : గత కొన్నాళ్లుగా వివాదాలతో వార్తల్లో నిలుస్తున్న పృథ్వీ షా ఎట్టకేలకు ఫామ్ అందుకున్నాడు. రంజీ ట్రోఫీ 2025-26 ఎడిషన్‌లో మహారాష్ట్రకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ విధ్వంసకర వీరుడు ఛండీగడ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో విశ్వరూపం చూపించాడు. రెండో ఇన్నింగ్స్‌ల్లో కేవలం 141 బంతుల్లోనే డబుల్ సెంచరీ సాధించాడు.
రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ చరిత్రలో ఇది రెండో వేగవంతమైన ద్విశతకం కావడం గమనార్హం. కాగా.. ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ రికార్డు టీమ్ఇండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి పేరిట ఉంది. 1984-85 సీజన్‌లో రవిశాస్త్రి 123 బంతుల్లో ద్విశతకం బాదాడు.
Virat kohli-Rohit Sharma : వార్నీ మళ్లీ రోహిత్, కోహ్లీలను మైదానంలో చూడాలంటే అన్ని రోజులు ఆగాలా?
ఈ మ్యాచ్‌లో 72 బంతుల్లో శతకాన్ని అందుకున్న షా (Prithvi Shaw) మరో 71 బంతుల్లో ద్విశతకాన్ని సాధించాడు. ఈ క్రమంలో రంజీల్లో మహారాష్ట్ర తరుపున అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇక ఓవరాల్‌గా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో పృథ్వీ షాకు ఇది 14వ సెంచరీ కావడం గమనార్హం.
ఇక ఈ మ్యాచ్‌లో పృథ్వీ షా మొత్తం 156 బంతులు ఎదుర్కొన్నాడు. 29 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 222 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో పృథ్వీ షా 8 పరుగులకే పెవిలియన్‌కు చేరుకున్నాడు. కాగా.. ఈ రంజీ సీజన్ ఆరంభానికి ముందే పృథ్వీ షా ముంబై నుంచి మహారాష్ట్రకు మారాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. రుతురాజ్ గైక్వాడ్ (116) సెంచరీ చేయడంతో మహారాష్ట్ర మొదటి ఇన్నింగ్స్‌లో 313 పరుగులు చేసింది. ఆ తరువాత చండీఘడ్ మొదటి ఇన్నింగ్స్‌లో 209 పరుగులకు ఆలౌటైంది. దీంతో మహారాష్ట్రకు కీలకమైన 104 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఆ తరువాత పృథ్వీ షా డబుల్ సెంచరీ చేయడంతో రెండో ఇన్నింగ్స్‌లో మహారాష్ట్ర 3 వికెట్ల నష్టానికి 359 పరుగులు చేసింది. దీంతో చండీఘడ్ ముందు 464 పరుగుల లక్ష్యం నిలిచింది.