Shreyas Iyer : ఎంత పనాయో.. అద్భుత క్యాచ్ అందుకుని.. ఐసీయూలో శ్రేయస్ అయ్యర్..! అంతర్గత రక్తస్రావం..!
శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) సిడ్నీలోని ఓ ఆస్పత్రిలో ఐసీయూలో అడ్మిట్ అయినట్లు తెలుస్తోంది
Shreyas Iyer Admitted To ICU In Sydney Report
Shreyas Iyer : టీమ్ఇండియా వన్డే వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సిడ్నీలోని ఓ ఆస్పత్రిలో ఐసీయూలో అడ్మిట్ అయినట్లు తెలుస్తోంది. ఆసీస్‌తో సిడ్నీ వేదికగా జరిగిన మూడో వన్డేలో అయ్యర్ (Shreyas Iyer) గాయపడిన సంగతి తెలిసిందే.
హర్షిత్ రాణా బౌలింగ్‌లో ఆసీస్ బ్యాటర్ అలెక్స్ కేరీ షాట్ ఆడగా అది మిస్‌టైమింగ్ కావడంతో బంతి గాల్లోకి లేచింది. బ్యాక్‌వర్డ్ పాయింట్ నుంచి వెనుకకు పరిగెత్తిన శ్రేయస్ అయ్యర్ డైవ్ చేస్తూ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. కాగా.. ఈ క్యాచ్‌ను అందుకునే సమయంలో అయ్యర్ బలంగా నేలను తాకాడు. ఆ సమయంలో అతడి పక్కటెముకలకు గాయమైంది. ఫిజియో వచ్చి పరిశీలించాడు. తీవ్రమైన నొప్పితో బాధపడుతుండడంతో అయ్యర్ మైదాన్ని వీడాడు.
వెంటనే బీసీసీఐ వైద్య బృందం అయ్యర్‌ను సిడ్నీలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ నిర్వహించిన వైద్య పరీక్షల్లో అతడికి అంతర్గత రక్తస్రావం అవుతున్నట్లు రిపోర్టులో వచ్చిందని దీంతో అతడిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు పీటీఐ తెలిపింది.
A STUNNER FROM VICE CAPTAIN SHREYAS IYER. 🥶 pic.twitter.com/zY5ENqGg6D
— Johns. (@CricCrazyJohns) October 25, 2025
‘అయ్యర్ పక్కటెముకల్లో గాయమైంది. రిపోర్టుల్లో అతడికి రక్తస్రావం అవుతున్నట్లు గుర్తించారు. వెంటనే అతడిని ఐసీయూలో చేర్చాం. కనీసం రెండు నుంచి ఏడు రోజుల పాటు అతడు వైద్యుల పర్యవేక్షణలోనే ఉంటాడు. రక్తస్రావం ఆగి, ఇన్ఫెక్షన్ కాకుండా ఉంటే అప్పుడు తదుపరి చర్యలు తీసుకుంటారు.’ అని ఓ బీసీసీఐ అధికారి చెప్పినట్లు పేర్కొంది.
‘శ్రేయస్ అయ్యర్ గాయపడిన వెంటనే టీమ్ డాక్టర్, ఫిజియో ఎలాంటి అవకాశాలను తీసుకోలేదు. వెంటనే అతడిని ఆస్పత్రికి తీసుకువెళ్లారు. లేకపోతే అతడికి ప్రాణాల మీదకు వచ్చి ఉండొచ్చు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. శ్రేయస్ అయ్యర్ ఎంతో ధృఢమైన వ్యక్తి.. అతడు త్వరగా కోలుకుని వస్తాడు.’ అని సదరు అధికారి చెప్పారు.
వాస్తవానికి అయ్యర్ మూడు వారాల్లో కోలుకుంటాడు అని తొలుత వార్తలు వచ్చాయి. ఇప్పుడు అంతర్గత రక్తస్రావం జరుగుతుండడంతో అతడు కోలుకునేందుకు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో అతడు చాలా కాలం పాటు ఆటకు దూరం అయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో అతడు దక్షిణాప్రికాతో వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉండకపోవచ్చు.
