Rinku Singh smashes runs at 240 strike rate in SMAT
Rinku Singh : దక్షిణాఫ్రికాతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ బుధవారం (డిసెంబర్ 3) ప్రకటించింది. అయితే.. ఈ జట్టులో టీమ్ఇండియా నయా ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్న రింకూ సింగ్ కు చోటు దక్కలేదు. ఈ విషయం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. అభిమానులతో పాటు పలువురు మాజీ ఆటగాళ్లు కూడా రింకూ సింగ్(Rinku Singh )కు జట్టులో చోటు కల్పించకపోవడంపై మండిపడ్డారు.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం రింకూ సింగ్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడుతున్నాడు. ఉత్తరప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న రింకూ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా చండీగఢ్ తో జరిగిన మ్యాచ్‌లో తన ఫినిషింగ్ నైపుణ్యాలను మరోసారి చూపించాడు. ఐదో స్థానంలో బరిలోకి దిగిన అతడు 10 బంతులను ఎదుర్కొని 240 స్ట్రైక్‌రేటుతో 24 పరుగులు చేశాడు. తన జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 212 పరుగుల భారీ స్కోరు చేయడంలో తన వంతు సాయం చేశాడు.
ఇక ఫీల్డింగ్‌లోనూ ఎంతో చురుకుగా కదిలిన అతడు రెండు క్యాచ్‌లను అందుకున్నాడు. 213 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో చండీగఢ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులకే పరిమితమైంది. దీంతో 40 పరుగుల తేడాతో ఉత్తరప్రదేశ్ విజయం సాధించింది.
దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు ఎందుకు ఎంపిక చేయలేదు?
రింకూ సింగ్ టీమ్ఇండియా తరుపున చివరగా ఆడిన కొన్ని మ్యాచ్‌ల్లో ఆశించిన స్థాయిలో ప్రభావం చూపించలేకపోయాడు. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ఎంపిక చేయకపోవడానికి గల కారణం అతడి ఫామా? లేక మరేమైన కారణాలు ఉన్నాయా? అన్నది తెలియరాలేదు.
ఆసియాకప్ 2025 విన్నింగ్ జట్టులో రింకూ సింగ్ భాగంగా అన్నాడు. అయితే.. ఈ మెగాటోర్నీలో ఫైనల్ మ్యాచ్ మినహా మిగిలిన మ్యాచ్‌ల్లో అతడికి తుది జట్టులో స్థానం దక్కలేదు. ఇక ఫైనల్‌లో కూడా ఆడిన తొలి బంతికి బౌండరీ కొట్టి టీమ్ఇండియా విజేతగా నిలవడంలో సాయం చేశాడు. ఇక ఆసీస్‌తో టీ20 సిరీస్‌లో ఆఖరి మ్యాచ్‌లో తుది జట్టులో చోటు దక్కినా.. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌లో అతడికి బ్యాటింగ్ చేసే ఛాన్స్ రాలేదు.
ఏదీ ఏమైనప్పటికి కూడా టీ20 ప్రపంచకప్ 2026కి మరో రెండు నెలల కన్నా తక్కువ సమయమే ఉంది. ఈ నేపథ్యంలో రింకూ దేశవాళీలో సత్తా చాటి ఈ మెగాటోర్నీలో చోటు దక్కించుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.