Rishabh Pant
స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్‌ను గత సంవత్సరం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ) రూ.27 కోట్లకు కొనుక్కున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (డీపీఎల్) 2025 వేలం బరిలోనూ రిషబ్ పంత్ నిలిచాడు. అతడితో పాటు పృత్యంశ్ ఆర్య, దిగ్వేష్ రాథి వంటి వారి పేర్లు కూడా వేలంలో ఉన్నాయి.
డీపీఎల్ వేలాన్ని జూలై 6, 7 తేదీలలో న్యూఢిల్లీలో నిర్వహించనున్నారు. ఈ సారి ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) రెండు కొత్త జట్లను ప్రకటించింది. దీంతో ఈ టోర్నీలో మొత్తం జట్ల సంఖ్య ఎనిమిదికి చేరింది.
ఔటర్ ఢిల్లీ జట్టును రూ.10.6 కోట్లకు సవితా పెయింట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సొంతం చేసుకుంది. న్యూ ఢిల్లీ జట్టును రూ.9.2 కోట్లకు భీమా టోల్లింగ్ అండ్ ట్రాఫిక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, క్రయాన్ అడ్వర్టైజింగ్ లిమిటెడ్ తీసుకున్నాయి.
ఇక ఇంతకు ముందే సెంట్రల్ ఢిల్లీ కింగ్స్, ఈస్ట్ ఢిల్లీ రైడర్స్, నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్, పురానీ ఢిల్లీ 6, సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్స్, వెస్ట్ ఢిల్లీ లయన్స్ ఉన్నాయి.
Also Read: తప్పంతా ఆర్సీబీదే.. తేల్చేసిన ట్రిబ్యునల్.. ఇంకా..
ఈ సందర్భంగా డీపీఎల్, డీడీసీఏ అధ్యక్షుడు రోహన్ జైట్లీ మాట్లాడుతూ.. “డిల్లీ ప్రీమియర్ లీగ్ కేవలం టోర్నమెంట్ మాత్రమే కాదు.. రాజధానిలోని క్రికెట్ సంస్కృతికి నిదర్శనం. మొదటి సీజన్‌లో కనిపించిన ప్రతిభ ఎంతో ఆశాజనకంగా ఉంది. దీంతో మరింత మంది ఆటగాళ్లకు అవకాశాలు లభిస్తున్నాయి. పృత్యంశ్ ఆర్య, దిగ్వేష్ రాథి లాంటి ఆటగాళ్లు డీపీఎల్ ద్వారానే గుర్తింపు పొందారు. ఐపీఎల్ 2025లో తమ ప్రతిభను చాటారు. దీంతో ఈ లీగ్‌కు ఎంతటి విలువ ఉందో స్పష్టమవుతోంది” అన్నారు.
“జూలై నెలలో జరిగే వేలం ఈ సీజన్‌కు కీలకం కానుంది. ఫ్రాంచైజీలు, ఆటగాళ్లు, అభిమానులకు మంచి ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు కృషి చేస్తున్నాం. రెండో సీజన్‌ను లీగ్ చరిత్రలో ప్రత్యేక ఘట్టంగా తీర్చిదిద్దేందుకు సమాయత్తమవుతున్నాం” అని తెలిపారు.
పంత్, దిగ్వేశ్, పృత్యంశ్‌తో పాటు ఐపీఎల్ ఆటగాళ్లు ఇషాంత్ శర్మ, ఆయుష్ బడోనీ, హర్షిత్ రాణా, హిమ్మత్ సింగ్, సుయాష్ శర్మా, మయాంక్ యాదవ్, అనుజ్ రావత్ డీపీఎల్ వేలంలో పాల్గొననున్నారు.