తప్పంతా ఆర్సీబీదే.. తేల్చేసిన ట్రిబ్యునల్.. ఇంకా..

"RCB చేసిన సోషల్ మీడియా ప్రకటనల వల్లే 3 - 5 లక్షల మంది ప్రజలు ఒక్కచోట గుమికూడారు" అని CAT వ్యాఖ్యానించింది.

తప్పంతా ఆర్సీబీదే.. తేల్చేసిన ట్రిబ్యునల్.. ఇంకా..

Updated On : July 1, 2025 / 6:36 PM IST

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో 11 మంది ప్రాణాలను బలిగొన్న తొక్కిసలాట ఘటనపై కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (CAT) సంచలన తీర్పు వెలువరించింది. ఈ దుర్ఘటనకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫ్రాంచైజీదే పూర్తి బాధ్యత అని, పోలీసులది ఏ మాత్రం తప్పులేదని స్పష్టం చేసింది.

అనుమతులు లేకుండా కేవలం సోషల్ మీడియా ప్రకటనలతో లక్షలాది మందిని ఒకేచోట చేర్చడం వల్లే ఈ ఘోరం జరిగిందని CAT తెలిపింది.  CAT తీర్పులో మూడు కీలక అంశాలు పేర్కొంది.

“RCB చేసిన సోషల్ మీడియా ప్రకటనల వల్లే 3 – 5 లక్షల మంది ప్రజలు ఒక్కచోట గుమికూడారు. దీనికి వారు పోలీసుల నుంచి ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోలేదు” అని CAT వ్యాఖ్యానించింది.

లక్షలాది మంది వస్తున్నారని తెలిశాక, భద్రతా ఏర్పాట్లు చేయడానికి పోలీసులకు కేవలం 12 గంటల సమయం మాత్రమే ఇచ్చారని ట్రిబ్యునల్ పేర్కొంది. “పోలీసులు కూడా మనుషులే. ఇంత తక్కువ సమయంలో అంత పెద్ద జనసమూహాన్ని నియంత్రించడం అసాధ్యం” అని అభిప్రాయపడింది.

ఆ ఘటన తర్వాత కర్ణాటక ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ అధికారి వికాష్ కుమార్ ను సస్పెండ్ చేసింది. అయితే, ఈ చర్య అన్యాయమని, ఎలాంటి ఆధారాలు లేకుండా అధికారిని బలిపశువును చేశారని పేర్కొంటూ CAT ఆ సస్పెన్షన్ ఉత్తర్వులను రద్దు చేసింది.

Also Read: రూ.84,000 భారీ తగ్గింపుతో కవాసకి నింజా 300.. స్టాక్ ఉన్నప్పుడే ఈ బైక్‌ కొనేయండి..

తొక్కిసలాటకు కారణాలు

పోలీసుల నివేదిక, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ఈ దుర్ఘటనకు దారితీసిన ప్రధాన కారణాలు ఇవే..

  • ఫ్రీ పాస్‌లపై గందరగోళం: విజయోత్సవ ర్యాలీకి ఫ్రీ పాసులు ఇస్తారనే ప్రచారం జరగడంతో జనం వెల్లువలా తరలివచ్చారు.
  • నియంత్రణ లేకపోవడం: స్టేడియం గేట్ల వద్ద సరైన నియంత్రణ లేకపోవడంతో, టికెట్లు లేని వారు కూడా లోపలికి చొరబడేందుకు ప్రయత్నించారు.
  • పరిమిత సీట్లు: స్టేడియం సామర్థ్యానికి మించి జనం రావడంతో తీవ్రమైన ఒత్తిడి ఏర్పడింది.
  • పోలీసులపై భారం: అదే సమయంలో బెంగళూరులో మరో ప్రభుత్వ కార్యక్రమం ఉండటంతో, పోలీసు బలగాలు రెండుచోట్లా విధుల్లో ఉండాల్సి వచ్చింది.
  • ఈ కారణాలన్నీ కలిసి ఒక భయంకరమైన తొక్కిసలాటకు దారితీశాయి.

ఈ తీర్పుతో.. ఈ దుర్ఘటనలో పోలీసుల పాత్రపై వచ్చిన విమర్శలకు తెరపడింది. అదే సమయంలో, భారీ ఈవెంట్లు నిర్వహించే సంస్థలు, క్రీడా జట్లు ఎంత బాధ్యతాయుతంగా ఉండాలో ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది. సరైన ప్రణాళిక, అనుమతులు లేకుండా చేసే పనులు ఎంతటి విషాదాన్ని మిగులుస్తాయో చెప్పడానికి చిన్నస్వామి స్టేడియం దుర్ఘటనే ఒక చేదు గుణపాఠం.