Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో మరో మ్యాచ్ ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేసింది. ఆఖరి బంతి వరకు నరాలు తెగె ఉత్కంఠ మధ్య రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. తద్వారా ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. మరోవైపు రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ ఇన్నింగ్స్ వృథా అయింది. ఈ సీజన్‌లో రాయల్స్ కు ఇది తొమ్మిదో ఓటమి. ఇప్పటికే ఆర్ఆర్ ప్లేఆఫ్స్ కు దూరమైన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్‌లో కేకేఆర్ మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. కేకేఆర్ బ్యాటర్లలో ఆండ్రీ రసెల్ (57 నాటౌట్; 25 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లు), రఘువంశీ (44; 31 బంతుల్లో 5 ఫోర్లు), గుర్బాజ్ (35; 25 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), రహానె (30; 24 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లు) లు రాణించారు.
PBKS vs LSG: రిషబ్ పంత్ ఈసారి బాల్, బ్యాట్ రెండూ గాల్లోకి లేపాడు.. సంజీవ్ గోయెంకా రియాక్షన్ వైరల్
అనంతరం రియాన్ పరాగ్ (95 45 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సర్లు) మెరుపులు మెరిపించినా లక్ష్య ఛేదనలో రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగులకు పరిమితమైంది. కేకేఆర్ బౌలర్లలో హర్షిత్ రాణా, మొయిన్ అలీ, వరుణ్ చక్రవర్తిలు తలా రెండు వికెట్లు తీశారు. వైభవ్ అరోరా ఓ వికెట్ సాధించాడు.
కేకేఆర్ చేతిలో పరుగు తేడాతో ఓడిపోవడంతో రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ విచారం వ్యక్తం చేశాడు. తాను 95 పరుగులు చేసిన ఓడిపోవడంతో బాధగా ఉందన్నాడు. ఈ ఓటమికి తానే బాధ్యుడినని చెప్పుకొచ్చాడు.
మ్యాచ్ అనంతరం పరాగ్ మాట్లాడుతూ.. ‘ఆఖరి వరకు నేను క్రీజులో ఉండాలని అనుకున్నాను. అయితే.. దురదృష్టవశాత్తు 18వ ఓవర్‌లో ఔటైయ్యాను. అది నాదే తప్పు. చివరి 6 ఓవర్లలో మేం సరైన బౌలింగ్ ఆప్షన్లు ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. ఏ బౌలర్‌పై నేను ఫిర్యాదు చేయడం లేదు. ఏది ఏమైనప్పటికి లక్ష్యాన్ని ఛేదించాల్సింది. ఇది నా తప్పిదమే.’ అని పరాగ్ అన్నాడు.
కేకేఆర్ ఆటగాడు రస్సెల్ గురించి మాట్లాడుతూ.. ‘అతడు మొదటి 10 బంతుల్లో 2 పరుగులే చేశాడు. ఆ తరువాత అతడు వేగంగా ఆడాడు. సిక్స్‌లు కొట్టేందుకు ఈ మైదానం ఎంతో అనువైనది. నేను అనుకున్న విధంగా షాట్లు ఆడాను. నేను మెరుగ్గానే బ్యాటింగ్ చేశా. సమిష్టి ప్రదర్శన చేయలేకపోయాం. అందుకే ఓడిపోయాం.’ అని పరాగ్ తెలిపాడు.