Rohit Sharma Comments after Team India beat Australia in 3rd ODI
Rohit Sharma : టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను, విరాట్ కోహ్లీ మళ్లీ ఆస్ట్రేలియా పర్యటనకు వస్తామో రామోనని అన్నాడు. ఏదీ ఏమైనప్పటికి ఆసీస్ గడ్డపై ఆడిన ప్రతి క్షణాన్ని ఎంతో ఆస్వాదించామని చెప్పుకొచ్చాడు. సిడ్నీ వేదికగా ఆసీస్‌తో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో భారత్ విజయం సాధించిన అనంతరం రోహిత్ శర్మ (Rohit Sharma) ఈ కామెంట్స్ చేశాడు.
మూడో వన్డే మ్యాచ్‌లో రోహిత్ శర్మ(121 నాటౌట్ 125 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్‌లతో ) శతకంతో చెలరేగాడు. అతడితో పాటు విరాట్ కోహ్లీ (74 నాటౌట్ 81 బంతుల్లో 7 ఫోర్లు) అజేయ అర్థశతకంతో రాణించాడు. హిట్ మ్యాన్ భారత విజయంలో కీలక పాత్ర పోషించడంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. అలాగే సిరీస్ మొత్తం రాణించడంతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు సైతం రోహిత్ శర్మ గెలుచుకున్నాడు.
Shubman Gill : వన్డే కెప్టెన్‌గా తొలి విజయం.. శుభ్‌మన్ గిల్ కామెంట్స్.. హర్షిత్ రాణా మా కోసం..
ఈ సందర్భంగా రోహిత్ శర్మ మాట్లాడుతూ.. తాను ఆస్ట్రేలియా పర్యటనకు రావడాన్ని ఎప్పుడూ ఇష్టపడతానని అన్నాడు. ఇక స్నిడీలో మ్యాచ్‌లు ఆడటాన్ని ఎప్పుడూ ఆస్వాదిస్తానని చెప్పుకొచ్చాడు. 2008లో తాను తొలిసారి ఆసీస్ పర్యటనకు వచ్చానని, నాటి జ్ఞాపకాలు మరిచిపోలేనన్నాడు. ఈ పర్యటన కూడా ఎంతో సరదాగా ఉందన్నాడు. తాము (కోహ్లీ, రోహిత్) క్రికెటర్లుగా మళ్లీ ఆసీస్ పర్యటనకు వస్తామో లేదో తనకు తెలియదన్నాడు. ఏదీ ఏమైనప్పటికి కూడా తాను ఇక్కడ ఆడిన ప్రతి క్షణాన్ని ఎంతో ఆస్వాదించానని తెలిపాడు. ఆసీస్ గడ్డపై ఆడడం తనకు ఎల్లప్పుడూ ఇష్టమేనని, కోహ్లీకి కూడా ఇలాగే ఉంటుందని తాను భావిస్తున్నట్లుగా చెప్పాడు.
ఇక ఈ సిరీస్‌లో మ్యాచ్‌లో రాణించడంపై మాట్లాడుతూ.. ఆసీస్‌లో రాణించడం అంత సులువు కాదన్నాడు. గత కొన్నాళ్లుగా తాను ఎక్కువగా మ్యాచ్‌లు ఆడలేదని, అయినప్పటికి కూడా ఈ సిరీస్ కోసం ఎంతో సన్నద్ధత అయినట్లుగా వివరించాడు. ఇక సిరీస్ గెలవలేకపోయినప్పటికి కూడా ఎన్నో సానుకూల అంశాలు ఉన్నాయన్నాడు. ఈ పర్యటన ద్వారా యువ ఆటగాళ్లు ఎంతో అనుభవాన్ని పొందారని చెప్పాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 46.4 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బ్యాటర్లలో మాట్ రెన్షా (56; 58 బంతుల్లో 2 ఫోర్లు) అర్థశతకం సాధించాడు. మిచెల్ మార్ష్ (41), మాథ్యూ షార్ట్ (30) పర్వాలేదనిపించారు. టీమ్ఇండియా బౌలర్లలో హర్షిత్ రాణా నాలుగు వికెట్లు తీశాడు. వాషింగ్టన్ సుందర్ రెండు, సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్‌లు తలా ఓ వికెట్ సాధించారు.
ఆ తరువాత రోహిత్ శర్మ, కోహ్లీలు రాణించడంతో 237 పరుగుల లక్ష్యాన్ని భారత్ 38.3 ఓవర్లలో వికెట్ నష్టపోయి అందుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించినప్పటికి సిరీస్‌ను 1-2 తేడాతో కోల్పోయింది.