Rohit Sharma
Rohit Sharma Retirement: బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా జట్ల మధ్య సిడ్నీ వేదికగా చివరి టెస్టు (ఐదో టెస్టు) మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మకు తుది జట్టులో చోటు దక్కకపోవడంపై క్రికెట్ ఫ్యాన్స్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే, రోహిత్ ఆస్ట్రేలియాతో జరిగిన మూడు టెస్టుల్లోనూ పరుగులు రాబట్టడంలో పూర్తిగా విఫలమవుతూ వస్తున్నాడు. దీనికితోడు రోహిత్ కెప్టెన్సీలో ఆడిన మూడు మ్యాచ్ లు వరుసగా ఓడిపోవటంతో టీం మేనేజ్ మెంట్ రోహిత్ శర్మను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రోహిత్ శర్మ టెస్టు ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడని.. ఆయన టెస్ట్ కెరీర్ ముగిసినట్లేనని క్రికెట్ వర్గాల్లో, మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతుంది. పలువురు మాజీ క్రికెటర్లుసైతం.. రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడమే కరెక్ట్ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో హిట్ మ్యాన్ తన రిటైర్మెంట్ విషయంపైనా, సిడ్నీ టెస్టులో తుది జట్టులో చోటు దక్కించుకోకపోవటంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
సిడ్నీ టెస్టు రెండో రోజు ఆటలో లంచ్ బ్రేక్ సమయంలో రోహిత్ శర్మ మాజీ టీమిండియా బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ తో కలిసి స్టార్ స్పోర్ట్స్ తో మాట్లాడాడు. ఈ క్రమంలో తన రిటైర్మెంట్ పై వస్తున్న వార్తలపై స్పందించాడు. నేను రిటైర్మెంట్ తీసుకోవడం లేదు. సిడ్నీ టెస్టు నుంచి మాత్రమే విశ్రాంతి తీసుకున్నా. తాను ఇద్దరు పిల్లల తండ్రిని.. ఏ సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో నాకు తెలుసు. నేను ఫామ్ లో లేనందునే సిడ్నీ టెస్టుకు దూరమయ్యా. జీవితంలో ప్రతిరోజూ మారుతుంది. నాకు పూర్తి నమ్మకం ఉంది. రాబోయే రోజుల్లో నేను మళ్లీ మంచి ఫామ్ తో జట్టులోకి తిరిగివస్తాను అంటూ రోహిత్ చెప్పారు.
సిడ్నీ టెస్టు నుంచి మాత్రమే నేను విశ్రాంతి తీసుకున్నానని చెప్పిన రోహిత్.. జట్టు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకోవటం జరిగిందని చెప్పాడు. పెర్త్ టెస్టులో కేఎల్ రాహుల్ – యశస్వీ జైస్వాల్ డబుల్ సెంచరీ భాగస్వామ్యంతో మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆ జోడీని మార్చకూడదనే ఉద్దేశంతోపాటు, నాకంటే కేఎల్ రాహుల్ ప్రస్తుతం ఫామ్ పరంగా మెరుగ్గా ఉన్నాడు. ఈ సిరీస్ లో 2-1తో వెనకబడి ఉన్నాం. సిడ్నీ టెస్టు టీమిండియాకు ఎంతో కీలకం. ఈ టెస్టులో విజయం సాధించాలంటే పరుగులు చేసే ప్లేయర్లు కావాలి. నేను గత కొన్ని మ్యాచ్ లలో పరుగులు రాబట్టడంలో విఫలమవుతున్నా. నాకంటే మెరుగైన ఫామ్ లో ఉన్న వారిని ఆడించేందుకు నేను పక్కకు తప్పుకున్నా. ఇదే విషయంపై కోచ్, సెలక్టర్ తో మాట్లాడా. వారుకూడా అందుకు ఓకే చెప్పడంతో నేను సిడ్నీ టెస్టు నుంచి తప్పుకున్నాను అంటూ రోహిత్ చెప్పాడు. కొన్ని సమయాల్లో జట్టు అవసరాలకోసం మనం కీలక నిర్ణయాలు తీసుకోవాలని రోహిత్ అన్నారు.
Also Read: AUS vs IND : సిడ్నీ టెస్టు.. తొలిరోజు ఆస్ట్రేలియాదే పైచేయి.. చివరిలో దిమ్మతిరిగే షాకిచ్చిన బుమ్రా
జస్ర్పీత్ బుమ్రా బంతితో అద్భుతంగా రాణిస్తున్నాడు. నేను 2013లో బుమ్రాను తొలిసారి చూసినప్పుడు.. ప్రస్తుతం అతని ఆటతీరులో చాలా మార్పు ఉంది. అతని గ్రాఫ్ క్రమంగా పెరుగుతూ వస్తుందని రోహిత్ చెప్పుకొచ్చారు. ఇక.. డ్రెస్సింగ్ రూంలో క్రికెటర్ల మధ్య సఖ్యత లేదని, వారి మధ్య విబేధాలు ఉన్నాయని వస్తున్న వార్తలపైనా హిట్ మ్యాన్ స్పందించారు. మీడియాలో వస్తున్నట్లు డ్రెస్సింగ్ రూమ్ లో ఎలాంటి సమస్యలు లేవు. అలాంటి ప్రచారాన్ని మనం నియంత్రించలేం అంటూ రోహిత్ పేర్కొన్నారు.
🚨 ROHIT SHARMA CONFIRMS HE IS NOT RETIRING ANYTIME SOON. 🚨
Rohit said, “runs are not coming now, but not guaranteed it’ll not come 5 months later. I’ll work hard”. pic.twitter.com/Hte8VT74kW
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 4, 2025