Rohit Sharma
Rohit Sharma Press Conference : వన్డే ప్రపంచకప్ 2023లో వరుస విజయాలతో ఫైనల్‌కు చేరుకున్న టీమ్ఇండియా ఆఖరి మెట్టు పై బోల్తా పడింది. ఈ ఓటమి ఆటగాళ్లతో పాటు కోట్లాది మంది ఫ్యాన్స్‌ను తీవ్ర నిరుత్సాహానికి గురి చేసింది. ఈ ఓటమి తరువాత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు మరో మ్యాచ్ ఆడలేదు. మొదటిసారి ఈ ఇద్దరూ దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు సిద్ధం అయ్యారు. డిసెంబర్ 26 నుంచి సెంచూరియన్ వేదికగా మొదటి టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఓటమి తరువాత మొదటి సారి కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడాడు.
దక్షిణాఫ్రికాలో టీమ్ఇండియా ఇప్పటి వరకు టెస్టు సిరీస్‌ను ఎప్పుడూ గెలవలేదు. ఇదే విషయాన్ని రోహిత్ శర్మ ప్రస్తావించారు. ఇక్కడ ఎప్పుడూ సిరీస్ గెలవలేదని, అయితే గెలిచేందుకు ఇప్పుడు ఓ సువర్ణావకాశం వచ్చిందన్నారు. గతంలో రెండు సార్లు సిరీస్ గెలిచేందుకు దగ్గరగా వచ్చినప్పటికీ సాధ్యం కాలేదన్నారు. ఇక్కడ మేము విజయం సాధిస్తే అది ప్రపంచకప్ ఓటమి బాధను దూరం చేస్తుందో లేదో తనకు తెలియని చెప్పారు. ఒకవేళ సిరీస్ సాధిస్తే మాత్రం అది ఓ గొప్ప విజయంగా నిలిచిపోతుందన్నారు.
ఆ ఇద్దరిలో మూడో పేసర్ ఎవరు..?
జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ లు తొలి టెస్ట్ ఆడబోతున్నారని రోహిత్ శర్మ ధృవీకరించారు. మూడో పేసర్‌గా ఎవరు ఉంటారు అనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. ముఖేష్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ లలో ఒకరు తుది జట్టులో ఉంటారనే విషయాన్ని మాత్రం చెప్పాడు. ఈ ఇద్దరిలో మూడో పేసర్‌గా ఎవరు బాధ్యతలు నిర్వర్తిస్తారు అనే విషయాన్ని టీమ్ మీటింగ్‌లో నిర్ణయిస్తామని తెలిపాడు. మహ్మద్ షమీ లేకపోవడం లోటేనని అన్నారు.
Gautam Gambhir : మిచెల్ స్టార్క్‌కు 24కోట్లు ఇప్పించారు.. నాకు ఓ రెండు కోట్లు ఇప్పించండయ్యా..
గత కొంతకాలంగా భారత పేసర్లు విదేశాల్లో చాలా గొప్పగా రాణిస్తున్నారు. ఇక్కడి పరిస్థితులు పేసర్లకు సహకరిస్తాయని, దక్షిణాఫ్రికా కండిషన్స్‌లలో ఎలా బౌలింగ్ చేయాలో మన పేసర్లకు తెలుసునని చెప్పారు. ప్రతి బౌలర్‌కు తమ పాత్ర ఏంటో స్పష్టంగా చెప్పామన్నారు. ఇక ఇద్దరు అనుభవజ్ఞులైన స్పిన్నర్లు మనకు ఉన్నారని, వారికి ఇలాంటి కండిషన్స్‌లలో ఎలా రాణించాలో తెలుసన్నాడు.
కీపర్‌గా కేఎల్ రాహుల్..
నిజాయతీగా చెప్పాలంటే దక్షిణాఫ్రికాలో బ్యాటింగ్ సవాల్‌తో కూడుకున్న విషయమన్నాడు. అయితే ఆ సవాల్‌ను స్వీకరించేందుకు బ్యాటర్లు సిద్ధంగా ఉన్నారన్నాడు. ఇక వికెట్ కీపర్‌గా రాహుల్‌ను తీసుకోవడం పైనా రోహిత్ శర్మ స్పందించాడు. ప్రపంచకప్‌లో రాహుల్ ఈ పాత్రను సమర్థవంతంగా పోషించాడన్నారు. అతడిని ఎంతకాలం ఇలా ఆడిస్తారో తెలియదని, అయితే.. ఈ పాత్రలో ఉన్నంత వరకు అతడు చక్కగా రాణిస్తాడనే విశ్వాస్వాన్ని రోహిత్ వ్యక్తం చేశాడు. రాహుల్ కీపింగ్ చేయడం వల్ల బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టం అవుతుందన్నాడు.
Hardik Pandya : హార్దిక్ పాండ్య ఒక్కడి కోసమే ముంబై ఇండియన్స్ రూ.100 కోట్లు ఖర్చు..!
ప్రపంచకప్ ఫైనల్ ఓటమిపై..
ప్రపంచకప్‌ను గెలిచేందుకు చాలా కష్టపడినట్లు రోహిత్ చెప్పాడు. టోర్నీ మొత్తంలో తాము ఆడిన విధానానికి సంతోషంగా ఉన్నట్లు చెప్పాడు. ఫైనల్‌లో కొన్ని తప్పిదాలు చేయడం వల్ల ఓడిపోయినట్లు వెల్లడించాడు. ఓటమి బాధకలిగించినప్పటికీ.. ముందుకు వెళ్లాల్సిన మార్గాన్ని కనుగొనాల్సిన అవసరం ఉందన్నాడు. బయట నుంచి లభించిన ప్రోత్సాహం మరువలేనిదని, వ్యక్తిగతంగా అది మనల్ని ఎంతో ప్రేరేపిస్తుందని రోహిత్ తెలిపారు.