తొలి టీ20లో రికార్డు సాధించిన రోహిత్

టీమిండియాకు తాత్కాలిక కెప్టెన్‌గా బంగ్లాదేశ్ తో తొలి టీ20 మ్యాచ్ ఆడుతున్న రోహిత్ శర్మ అరుదైన రికార్డ్‌ నెలకొల్పాడు. ఆదివారం ఢిల్లీలోని ఫిరోజ్ షా స్టేడియం వేదికగా ఫస్ట్ ఓవర్‌లోనే రెండు ఫోర్లతో రోహిత్ శర్మ (9: 5 బంతుల్లో 2ఫోర్లు)స్కోరు చేశాడు. దీంతో టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా ఘనత సాధించాడు. తొలి ఓవర్‌లోనే మంచి ఊపుమీద కనిపించిన రోహిత్.. ఓవర్ ఆఖరి బంతికి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 
 
మ్యాచ్ ముందు 2వేల 443 పరుగులతో ఉన్న రోహిత్ 9 పరుగులు చేసి 2వేల 452 పరుగులతో టాప్ పొజిషన్లో ఉన్న విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టాడు. ఈ స్థానం అందుకోవడానికి కోహ్లీ కేవలం 67 ఇన్నింగ్స్‌లు మాత్రమే తీసుకోగా రోహిత్ శర్మకు 91 ఇన్నింగ్స్‌ల సమయం పట్టింది. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో వీరితో పాటు మార్టిన్ గఫ్తిల్ (2వేల 285 పరుగులు), షోయబ్ మాలిక్ (2వేల 263), బ్రెండన్ మెక్‌కలమ్ (2వేల 140) టాప్-5లో నిలిచారు. 
  
బంగ్లాదేశ్‌తో 3 టీ20ల సిరీస్ జరగనుండగా రెగ్యూలర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. తాత్కాలిక కెప్టెన్‌గా రోహిత్ శర్మ జట్టుని నడిపిస్తున్నాడు. మరో రెండు టీ20ల్లోనూ రోహిత్ చెలరేగితే ఇంకొద్ది రోజులు టాప్ 1స్థానంలో హిట్ మాన్ కొనసాగుతాడు.