BCCI Bank Balance : బీసీసీఐ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో తెలుసా? 2019లో 6వేల కోట్లు ఉండగా..
బీసీసీఐ బ్యాంక్ బ్యాలెన్స్ (BCCI Bank Balance)2019లో 6వేల కోట్లు ఉండగా 2024 నాటికి 20 వేల కోట్లను దాటింది

BCCI Bank Balance Revealed In Stunning Revenue Report
BCCI Bank Balance : ప్రపంచంలోనే ధనిక క్రికెట్ బోర్డుగా బీసీసీఐకి పేరుంది. ఐపీఎల్‌తో బీసీసీఐ దశ తిరిగింది. ఒకప్పుడు మ్యాచ్‌లను నిర్వహించేందుకు ఇబ్బంది పడింది బోర్డు. అయితే.. ప్రస్తుతం బీసీసీఐ ఖాతాలో వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. ప్రతి ఏడాది తన ఆదాయాన్ని పెంచుకుంటూ పోతుంది. గత ఐదేళ్లలో బీసీసీఐ బ్యాంక్ బ్యాలెన్స్ భారీగానే పెరిగింది. ప్రస్తుతం బీసీసీఐ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో మీకు తెలుసా?
2019లో బీసీసీఐ బ్యాంకు బ్యాలెన్స్ రూ.6059 కోట్లుగా ఉంది. 2024 నాటికి రూ.20,686 కోట్లకు చేరుకుంది. అంటే గత ఐదేళ్లలో రూ.14,627 కోట్ల మేర బ్యాలెన్స్‌ను పెంచుకుంది. రాష్ట్ర క్రికెట్ సంఘాలకు అన్ని బకాయిలను చెల్లించిన తరువాతనే ఇంత మొత్తం ఉండడం విశేషం. గత ఆర్థిక సంవత్సరమే రూ.4193 కోట్లు బీసీసీఐ ఖాతాలో చేరాయి. ఈ వివరాలు రాష్ట్ర క్రికెట్ సంఘాల మధ్య పంచిన నివేదికలో వెల్లడయ్యాయి.
ZIM vs SL : శ్రీలంకకు బిగ్ షాక్.. రెండో టీ20లో జింబాబ్వే సంచలన విజయం..
ఇక బీసీసీఐ సాధారణ నిధి దాదాపు రెట్టింపు అయిందని క్రిక్‌బజ్ నివేదిక పేర్కొంది. 2019లో రూ.3,906 కోట్లు ఉండగా 2024లో రూ.7,988 కోట్లకు చేరుకున్నట్లు తెలిపింది. అంటే రూ 4082 కోట్ల రూపాయల వృద్ధిని నమోదు చేసింది. బీసీసీఐ ఆర్థిక విజయానికి ప్రధాన కారణాలు ఐపీఎల్ నుంచి వచ్చిన లాభాలు, ఐసీసీ నుంచి వచ్చిన ఆదాయం.
కాగా.. 2023లో వన్డే ప్రపంచకప్‌ను భారత్‌లో నిర్వహించిన సంగతి తెలిసిందే. దీంతో మీడియా హక్కుల ఆదాయం 2524.80 కోట్ల నుంచి 813.14 కోట్లకు పడిపోయింది. అయినప్పటికి బీసీసీఐ బ్యాంక్ డిపాజిట్లపై వడ్డీ ఆదాయం 533.50 కోట్ల నుంచి 986.45 కోట్లకు పెరగడం విశేషం. బీసీసీఐ ఆర్థిక సంవత్సరంలో 3,150 కోట్ల రూపాయలను ఆదాయపు పన్ను బాధ్యతల కోసం కేటాయించింది. అయితే వివిధ కోర్టులు, ట్రిబ్యునళ్లలో ఈ విషయంపై అప్పీళ్లు నడుస్తున్నాయి.
ఐపీఎల్ ఆదాయాలు, ఐసీసీ పంపిణీల సహాయంతో బీసీసీఐ 2023-24కి రూ.1,623.08 కోట్ల మిగులును నమోదు చేసింది. ఇది గత సంవత్సరం రూ.1,167.99 కోట్ల కంటే ఎక్కువ మొత్తం. 2023-24 సంవత్సరానికి బీసీసీఐ మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.1,200 కోట్లు, ప్లాటినం జూబ్లీ బెనివలెంట్ ఫండ్ కోసం రూ.350 కోట్లు, క్రికెట్ అభివృద్ధికి రూ.500 కోట్లు కేటాయించింది. రాష్ట్ర సంఘాలకు రూ.1,990.18 కోట్లు అందాయని, ప్రస్తుత సంవత్సరానికి రూ.2,013.97 కోట్లు అందుతాయని నివేదిక పేర్కొంది.
సెప్టెంబర్ 28న జరిగే బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం జరగనుంది. ఆ సమావేశంలో అధికారికంగా ఈ వివరాలను తెలియజేయనున్నట్లు నివేదిక పేర్కొంది.