ZIM vs SL : శ్రీలంకకు బిగ్ షాక్.. రెండో టీ20లో జింబాబ్వే సంచలన విజయం..
శ్రీలంకకు పసికూన జింబాబ్వే (ZIM vs SL) గట్టి షాక్ ఇచ్చింది. రెండో టీ20లో 5 వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది.

Zimbabwe won by 5 wickets against Srilanka in 2nd T20
ZIM vs SL : వన్డే సిరీస్ ను 2-0 తేడాతో కోల్పోయినప్పటికి కూడా పసికూన జింబాబ్వే టీ20ల్లో మాత్రం పోరాడుతోంది. తొలి టీ20 మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికి రెండో టీ20 మ్యాచ్‌లో సంచలన విజయాన్ని సాధించింది. దీంతో ప్రస్తుతానికి సిరీస్ 1-1తో సమంగా ఉంది. ఈ సిరీస్‌లో చివరిదైన మూడో టీ20 మ్యాచ్ నేడు (ఆదివారం సెప్టెంబర్ 7) జరగనుంది.
శనివారం హరారే వేదికగా రెండో టీ20 మ్యాచ్‌లో శ్రీలంక, జింబాబ్వేలు (ZIM vs SL) తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది. జింబాబ్వే బౌలర్ల ధాటికి లంక బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో లంక 17.4 ఓవర్లలో 80 పరుగులకే కుప్పకూలింది.
లంక బ్యాటర్లలో కమిల్ మిషారా (20), చరిత్ అసలంక (18), దాసున్ షనక (15) లు మాత్రమే రెండు అంకెల స్కోరు సాధించారు. మిగిలిన వారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఎవాన్స్, సికందర్ రాజా లు చెరో మూడు వికెట్లు తీశారు. ముజారబానీ రెండు వికెట్లు పడగొట్టాడు.
అనంతరం 81 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు జింబాబ్వే అపసోపాలు పడింది. అయినప్పటికి ఎలాగోలా 14.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలను చేరింది. జింబాబ్వే బ్యాటర్లలో తషింగా ముసేకివా (21), ర్యాన్ బర్ల్ (20),బ్రియాన్ బెన్నెట్(19), తాడివానాషే మారుమణి (17) లు రాణించారు. లంక బౌలర్లలో దుష్మంత చమీర మూడు వికెట్లు పడగొట్టాడు. బినూర ఫెర్నాండో, మహేశ్ తీక్షణలు చెరో వికెట్ సాధించారు.