Rohit Sharma unlikely to be picked for Tests again Reports
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టు కెరీర్ ఇక ముగిసిందా ? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం హిట్‌మ్యాన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ అతడు రిటైర్‌మెంట్ ప్రకటించకపోయినా కూడా సుదీర్ఘ ఫార్మాట్‌లో మాత్రం రోహిత్ చివరి మ్యాచ్ ఆడేశాడని చెబుతున్నారు.
రోహిత్ శర్మను మళ్లీ టెస్టులకు ఎంపిక చేసే అవకాశం లేదని, భవిష్యత్తులో బుమ్రా జట్టుకు కెప్టెన్‌గా ఉంటాడని ఆంగ్లమీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ ఏడాది జూన్ వరకు భారత్ కు టెస్టు మ్యాచ్‌లు లేవు. జూన్‌లో భారత జట్టు ఇంగ్లాండ్‌లో పర్యటించనుంది. ఇంగ్లాండ్‌తో 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ నుంచే ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ నాలుగో సీజన్ ప్రారంభం కానుంది.
IND vs PAK : కోహ్లీనే కాదు భారత క్రికెటర్లను ఎవ్వరిని హగ్ చేసుకోవద్దు..
రోహిత్ శర్మ స్థానంలో జస్‌ప్రీత్ బుమ్రాను భారత జట్టు కెప్టెన్ ఎంపిక చేయాలని సెలక్టర్లు భావిస్తున్నట్లుగా సదరు కథనాల సారాంశం. ప్రస్తుతం బుమ్రా వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి దూరం అయ్యాడు. ఐపీఎల్ 2025లో రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే బుమ్రా కెప్టెన్‌గా తన కెప్టెన్సీ సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో తొలి, ఆఖరి టెస్టులకు సారథ్యం వహించాడు. అయితే.. తొలి టెస్టులో భారత్ విజయం సాధించగా ఆఖరి టెస్టులో ఓడిపోయింది.
గతేడాది ఘోర పరాభవాలు..
గతేడాది రోహిత్ శర్మ అటు కెప్టెన్‌గా, ఇటు బ్యాటర్‌గా పూర్తిగా విఫలం అయ్యాడు. అందులో సొంత గడ్డపై న్యూజిలాండ్ చేతిలో 3-0 తేడాతో ఘోర పరాభవం ఒకటి. భారత టెస్టు క్రికెట్ చరిత్రలో సొంత గడ్డపై ప్రత్యర్థి చేతిలో వైట్‌వాష్ కావడం టీమ్ఇండియాకు ఇదే తొలిసారి. అటు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత్ 1-3తో కోల్పోయింది. ఇక గత 15 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో హిట్‌మ్యాన్ 164 పరుగులే చేశాడు. దీంతో ఆస్ట్రేలియాతో జరిగిన ఐదో మ్యాచ్ నుంచి స్వయంగా తప్పుకోవాల్సి వచ్చింది.
ఇటీవలే ఇంగ్లాండ్‌తో రెండో వన్డేలో శతకంతో ఫామ్‌లోకి వచ్చాడు రోహిత్ శర్మ. అయినప్పటికి టీమ్ఇండియా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుంటే టెస్టుల్లో హిట్‌మ్యాన్ కెరీర్ ముగిసినట్లేనని ప్రచారం జరుగుతోంది.