RR not planning to trade Samson or any of their players reports
ఐపీఎల్ 2026 సీజన్‌కు ఇంకా చాలా సమయం ఉంది. అయితే.. ఇప్పటి నుంచే అన్ని ఫ్రాంఛైజీలు కూడా ఈ సీజన్ కోసం సిద్ధం అవుతున్నాయి. ఐపీఎల్ 2025 ముగిసిన వెంటనే ట్రేడ్ విండో ఓపెన్ అయింది. ఈ విండో ద్వారా ఫ్రాంఛైజీలు పరస్పర అంగీకారంతో ఆటగాళ్లను మార్చుకోవచ్చు. ఈ క్రమంలో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ పై చెన్నై సూపర్ కింగ్స్ ఆసక్తిగా ఉందని, త్వరలోనే అతడిని ట్రేడ్ విండో ద్వారా దక్కించుకోనున్నట్లు వార్తలు వచ్చాయి.
ధోని కెరీర్ ముగింపు దశకు చేరుకుంటుండడంతో ఓ నమ్మకమైన వికెట్ కీపర్, బ్యాటర్ కోసం సీఎస్‌కే వెతుకుతోందని ఈ క్రమంలోనే ఆ జట్టు శాంసన్ పై కన్నేసిందనేది సదరు వార్తల సారాంశం. సోషల్ మీడియాలో ఈ వార్తలు హల్ చల్ చేస్తున్నప్పటికి కూడా ఇప్పటి వరకు దీనిపై అటు సీఎస్‌కే, రాజస్థాన్ ఇటు సంజూ శాంసన్ స్పందించలేదు.
APL : శుక్రవారం నుంచే ఆంధ్ర ప్రీమియర్ లీగ్.. అంబాసిడర్‌గా హీరో వెంకటేశ్..
ఇదిలా ఉంటే.. రాజస్థాన్ రాయల్స్ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా ఆంగ్ల మీడియాలో ప్రస్తుతం ఓ వార్త వైరల్ అవుతోంది. సంజూ శాంసన్‌నే కాదు ఇంకా ఏ ఆటగాడిని కూడా ట్రేడ్ విండో ద్వారా మార్పిడి చేయడకూదని ఆర్ఆర్ నిర్ణయం తీసుకుందనేది సదరు వార్త సారాంశం.
‘ఆర్ఆర్ కీలక నిర్ణయం తీసుకుంది. శాంసన్ లేదా ఇతర ఏ క్రికెటర్‌నైనా ట్రేడ్ చేయాలని అనుకోవడం లేదు. మా జట్టులో శాంసన్ ఇప్పటికే సెటిలైపోయాడు. ఎలాంటి వివాదం లేని నాయకుడు అతడు. అందుకనే మాకు అతడిని వదులుకోవాల్సిన అవసరం లేదు’ అని రాజస్థాన్ వర్గాలు వెల్లడించినట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి.
చూపుడు వేలు గాయంతో ఐపీఎల్ 2025 సీజన్‌లో సంజూ శాంసన్ కొన్ని మ్యాచ్‌లకు దూరం అయ్యాడు. 9 మ్యాచ్‌లు ఆడి 140.39 స్ట్రైక్‌రేటుతో 285 పరుగులు చేశాడు. శాంసన్ గైర్హాజరీలో రియాన్ పరాగ్ ఆర్ఆర్‌కు నాయకత్వం వహించాడు. మొత్తంగా శాంసన్ ఇప్పటి వరకు 177 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. 30.9 సగటుతో 4704 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, 26 అర్థశతకాలు ఉన్నాయి.