Salman Ali Agha comments ahead of Asia Cup 2025 Final match
IND vs PAK : ఆసియాకప్ 2025 ఆఖరి అంకానికి చేరుకుంది. ఆదివారం (సెప్టెంబర్ 28న) భారత్, పాక్ జట్ల మధ్య దుబాయ్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ట్రోఫీని ముద్దాడాలని ఇరు జట్లు కోరుకుంటున్నాయి. ఈ క్రమంలో మ్యాచ్‌కు ముందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా మాట్లాడాడు. టీమ్ఇండియాతో మ్యాచ్ అంటేనే ఒత్తిడి ఎక్కువగా ఉంటుందన్నాడు. గతంలో చేసిన పొరపాట్లను ఈ సారి చేయకుండా చూసుకుంటామని తెలిపాడు.
‘భారత్, పాక్ జట్లు తలపడుతున్నాయంటే ఆటగాళ్ల పై ఒత్తిడి ఖచ్చితంగా ఉంటుంది. లేదు అని చెప్పడం తప్పు. ఈ టోర్నీలో ఇప్పటికే భారత్‌తో రెండు సార్లు తలపడ్డాం. అయితే.. ఈ మ్యాచ్‌ల్లో మేం ఎక్కువగా పొరపాట్లు చేశాం. అందుకనే ఓడిపోయాం. కానీ ఈ సారి చాలా అలా జరగనివ్వం. ఆ తప్పులను సరిదిద్దుకుని విజయం సాధిస్తాం. క్రికెట్‌లో తక్కువ తప్పులు చేసిన జట్లే విజయం సాధిస్తాయి.’ అని సల్మాన్ అన్నాడు.
Asia cup 2025 : హరిస్ రవూఫ్, సూర్యకుమార్ యాదవ్‌లకు షాకిచ్చిన ఐసీసీ.. 30 శాతం జరిమానా.. ఇంకా..
కరచాలనం పై ఏమన్నాడంటే..?
ఏ జట్లు ఎలా ఉన్నా సరే తాము మాత్రం ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ప్రోటోకాల్స్‌ను ఫాలో అవుతాం అని చెప్పుకొచ్చాడు. వారు కరచాలనం చేయడానికి వస్తే తాము ముందడుగు వేస్తామని తెలిపాడు. తమ చేతుల్లో లేని వాటిపై తాము దృష్టి సారించమని అన్నాడు. మీడియాలో, బయట అనుకునేవి ఏమీ తాము పట్టించుకోమన్నాడు.
తమ లక్ష్యం ఆసియాకప్ మాత్రమేనని, నాణ్యమైన క్రికెట్ ఆడేందుకే ఇక్కడకు వచ్చినట్లుగా తెలిపాడు. ఉత్తమ క్రికెట్ ఆడుతూ 40 ఓవర్ల పాటు తమ ప్రణాళికలను సరిగ్గా అమలు చేస్తే తాము ఏ జట్టునైనా ఓడిస్తామని అన్నాడు. ఇక ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధిస్తామనే ధీమాను వ్యక్తం చేశాడు.
టాస్ గురించి ఏమన్నాడంటే..?
ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్‌లో టాస్ గెలిచిన జట్లు18 మ్యాచ్‌ల్లో 11 సార్లు విజయం సాధించాయి. ఈ క్రమంలో ఫైనల్ మ్యాచ్‌లోనూ టాస్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందా అనే ప్రశ్న పాక్ కెప్టెన్ సల్మాన్‌కు ఎదురుకాగా.. టాస్ గెలుస్తామా లేదా అనేది తమ చేతుల్లో లేదన్నాడు. టాస్ గురించి పెద్దగా పట్టించుకోమన్నాడు. వ్యూహాలను మైదానంలో సమర్ధవంతంగా అమలు చేయడం పైనే దృష్టి సారిస్తామని చెప్పుకొచ్చాడు.