Sanju Samson Fined Rs 24 Lakh By BCCI After RR Loss Against GT
అసలే ఓటమి బాధలో ఉన్న రాజస్థాన్ రాయల్స్‌కు బీసీసీఐ షాకిచ్చింది. బుధవారం అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్‌లో ఆర్ఆర్ 58 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ సీజన్‌లో రాజస్థాన్‌కు ఇది మూడో ఓటమి. గుజరాత్‌తో మ్యాచ్ ఓడిపోవడంతో సంజూ శాంసన్ తీవ్ర నిరాశలో ఉన్నాడు. ఈ సమయంలో అతడికి మరో షాక్ తగిలింది. అతడితో పాటు ఆ జట్టు సభ్యులకు ఐపీఎల్ నిర్వాహకులు జరిమానా విధించారు.
గుజరాత్‌తో మ్యాచ్‌లో స్లో ఓవర్‌కు పాల్పడడం ఇందుకు కారణం. నిర్ణీత సమయంలో ఓవర్లను పూర్తి చేయడంతో రాజస్థాన్ రాయల్స్ విఫలం కావడంతో కెప్టెన్ సంజూ శాంసన్‌కు రూ.24 లక్షల జరిమానా విధించారు.
Sanju Samson fined 24 Lakhs for maintaining slow overrate. pic.twitter.com/BaoDW0gKfW
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 10, 2025
అంతేకాదండోయ్ ఇంపాక్ట్ ప్లేయర్ సహా మిగిలిన ఎలెవన్‌లోని ఆటగాళ్లకు రూ.6లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 25 శాతం, ఈ రెండింటిలో ఏదీ తక్కువైతే అది జరిమానాగా కట్టాల్సి ఉంటుందని ఐపీఎల్ నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు.
ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు స్లో ఓవర్ రేటుకు పాల్పడడం ఇది రెండో సారి. చెన్నైతో మ్యాచ్‌లో కూడా ఆర్ఆర్ స్లో ఓవర్‌ను కొనసాగించింది. దీంతో ఆ మ్యాచ్‌కు తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించిన రియాన్ పరాగ్‌కు రూ.12లక్షల జరిమానా విధించారు.
ఇక గుజరాత్, రాజస్థాన్ మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో సాయి సుదర్శన్ (82; 53 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. మిగిలిన వారిలో జోస్ బట్లర్ (36), షారుక్ ఖాన్ (36)లు రాణించారు. ఆర్ఆర్ బౌలర్లలో తుషార్ దేశ్ పాండే, మహేశ్ తీక్షణ చెరో రెండు వికెట్లు తీశారు. జోప్రా ఆర్చర్, సందీప్ శర్మలు తలా ఓ వికెట్ పడగొట్టారు.
అనంతరం.. షిమ్రాన్ హెట్మెయర్ (52; 32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు), సంజు శాంసన్ (41; 28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) లు రాణించినా.. యశస్వి జైస్వాల్ (6), నితీశ్ రాణా (1), ధ్రువ్ జురెల్ (5) లు విఫలం కావడంతో లక్ష్య ఛేదనలో రాజస్థాన్ 19.2 ఓవర్లలో 159 పరుగులకే కుప్పకూలింది. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ మూడు వికెట్లు తీయగా రషీద్ ఖాన్, సాయి కిషోర్ చెరో రెండు వికెట్లు సాధించారు. సిరాజ్, అవేశ్ ఖాన్, కుల్వంత్ ఖేజ్రోలియా లు తలా ఓ వికెట్ పడగొట్టారు.