Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ప్రయాణం పడుతూ లేస్తూ సాగుతోంది. టోర్నిని వరుసగా రెండు ఓటములతో మొదలు పెట్టిన రాజస్థాన్ ఆతరువాత వరుసగా రెండు విజయాలతో పుంజుకుంది. అయితే.. బుధవారం అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్ఆర్ 58 పరుగుల తేడాతో ఓడిపోయింది. తన వికెట్ పడడంతోనే మ్యాచ్ మలుపు తిరిగిందని రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ చెప్పాడు. బౌలింగ్‌లో ఎక్కువ పరుగులు ఇచ్చామని, డెత్ బౌలింగ్‌ను మెరుగు పరచుకోవాల్సి ఉందన్నాడు.
గుజరాత్‌తో ఓటమి తరువాత రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ మాట్లాడుతూ.. బౌలింగ్‌లో తాము 15 నుంచి 20 పరుగులు ఎక్కువగా ఇచ్చామన్నాడు. ఇక బ్యాటింగ్‌లో దూకుడుగా ఆడుతూ మ్యాచ్‌ను మా వైపుకు తిప్పుకునే సమయంలో వికెట్లు కోల్పోయామని చెప్పుకొచ్చాడు. తాను, షిమ్రాన్ హెట్మెయర్ కలిసి బ్యాటింగ్ చేసినప్పుడు.. మ్యాచ్ మా చేతుల్లోనే ఉందని భావించినట్లు సంజూ తెలిపాడు.
అయితే.. ‘నా వికెట్ పడ్డాక గేమ్ మలుపు తిరిగింది. వరుసగా వికెట్లను కోల్పోయాం. పిచ్ నుంచి బౌలర్లకు మంచి సహకారం ఉంది. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ చేసిన విధానం చూస్తే ఈ విషయం అర్థమవుతోంది. అతడు గిల్ వికెట్ తీసిన చూసిన ఈ విషయం స్పష్టమవుతుంది. అయితే.. డెత్ ఓవర్లలో మా బౌలింగ్ తీరు ఆశించిన స్థాయిలో లేదు. దీన్ని గురించి మీటింగ్‌లో చర్చించుకుని సరి చేసుకుంటాము. ఓటములు ఎదురైనప్పుడు ముందుగా బ్యాటింగ్ చేయాలా లేదా బౌలింగ్ చేయాలా అన్నది ఆలోచించాలి. ఇది మంచి పిచ్. ఈ పరిస్థితులను గౌరవిస్తూ ఛేదనలో గెలిచే సామర్థ్యం ఉన్న జట్టుగా మలుచుకుంటాం.’ అని సంజూ శాంసన్ అన్నాడు.
ఈ మ్యాచ్‌లో సాయి సుదర్శన్ (82; 53 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. మిగిలిన వారిలో జోస్ బట్లర్ (36), షారుక్ ఖాన్ (36)లు రాణించారు. ఆర్ఆర్ బౌలర్లలో తుషార్ దేశ్ పాండే, మహేశ్ తీక్షణ చెరో రెండు వికెట్లు తీశారు. జోప్రా ఆర్చర్, సందీప్ శర్మలు తలా ఓ వికెట్ పడగొట్టారు.
అనంతరం.. షిమ్రాన్ హెట్మెయర్ (52; 32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు), సంజు శాంసన్ (41; 28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) లు రాణించినా.. యశస్వి జైస్వాల్ (6), నితీశ్ రాణా (1), ధ్రువ్ జురెల్ (5) లు విఫలం కావడంతో లక్ష్య ఛేదనలో రాజస్థాన్ 19.2 ఓవర్లలో 159 పరుగులకే కుప్పకూలింది. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ మూడు వికెట్లు తీయగా రషీద్ ఖాన్, సాయి కిషోర్ చెరో రెండు వికెట్లు సాధించారు. సిరాజ్, అవేశ్ ఖాన్, కుల్వంత్ ఖేజ్రోలియా లు తలా ఓ వికెట్ పడగొట్టారు.