×
Ad

అప్పుడు ధోనిని కూడా కెప్టెన్సీ నుంచి తొలగించాలనుకున్న సెలెక్టర్లు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే? ఇప్పుడు మాత్రం రోహిత్‌ని..

సెలెక్టర్లు ధోనీని టెస్ట్ కెప్టెన్‌గా తొలగించాలని నిర్ణయించారు. కానీ, అప్పట్లో ధోని వైపే అదృష్టం ఉంది.

Rohit Sharma captaincy: రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించడంతో అభిమానులు షాక్‌ అయ్యారు. రోహిత్ 2025 ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను గెలిపించిన విషయం తెలిసిందే. కెప్టెన్‌గా భారత్‌కు ఎన్నో విజయాలను అందించాడు. అయినప్పటికీ, టీమిండియా భవిష్యత్తుపై దృష్టి పెట్టిన సెలెక్టర్లు రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించక తప్పలేదు.

గతంలో విరాట్ కోహ్లీని కూడా సెలెక్టర్లు వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించిన విషయం తెలిసిందే. అయితే, విరాట్ టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్న కారణంతో వన్డే కెప్టెన్సీ నుంచి అతడిని తొలగించారు. వన్డే, టీ20 ఫార్మాట్లలో ఒకే కెప్టెన్‌ ఉండాలన్న ఉద్దేశంతో విరాట్‌ను కెప్టెన్సీ నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

విరాట్‌కు ముందు, కొంత కాలం క్రితం ఎమ్మెస్‌ ధోనీ కూడా అదే పరిణామాన్ని ఎదుర్కోవచ్చన్న అనుమానాలు వచ్చాయి. 2011/12లో భారత జట్టు ఆడిన తీరు, వచ్చిన ఫలితాలు నిరాశాకరంగా ఉండటంతో సెలెక్టర్లు ధోనీని కెప్టెన్‌గా తొలగించాలని నిర్ణయించారు. కానీ, అప్పట్లో ధోని వైపే అదృష్టం ఉంది.

Also Read: అవమానం.. అందుకే ఆస్ట్రేలియా సిరీస్‌ తర్వాత కోహ్లీ, రోహిత్ శర్మ వన్డేలకు సైతం రిటైర్‌మెంట్‌ ప్రకటిస్తారు: మనోజ్‌ తివారీ

ఆ సమయంలో ఆస్ట్రేలియా, శ్రీలంక, భారత్‌ ముక్కోణ సిరీస్‌కు కొత్త కెప్టెన్‌ను నియమించాలనుకున్నారు. దీనిపై మాజీ సెలెక్టర్ మొహిందర్ అమర్‌నాథ్ 2012లో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… “మాహేంద్ర సింగ్ ధోనిని మార్చాలని మేము తీసుకున్న ఏకగ్రీవ నిర్ణయాన్ని బోర్డ్ ప్రెసిడెంట్ ఆమోదించలేదు. దీంతో ముక్కోణ సిరీస్‌కు జట్టుకు 17 మంది ఆటగాళ్లను ఎంపిక చేశాం. కానీ కెప్టెన్‌ను ఎంపిక చేయలేదు. కెప్టెన్‌ను మరొకరు ఎంపిక చేశారు” అని తెలిపారు.

దీంతో ధోని కెప్టెన్‌గా కొనసాగాడు. ఆ ముక్కోణపు సిరీస్‌లో భారత్‌ ఫైనల్‌కు చేరలేకపోయింది. 2012 ఆసియా కప్‌లో కూడా ఫైనల్‌కు చేరలేదు. 2012 టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌కు కూడా చేరలేదు.

ధోనీ నేతృత్వంలోని భారత జట్టు 2013 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించి ట్రోఫీని గెలిచింది. 2014 టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌కి చేరింది, 2015 వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌కి కూడా చేరింది. 2016 టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌లో వెస్టిండీస్ చేతిలో ఓడిపోయింది. 2017 జనవరిలో ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు.