Kuldeep Yadav Key Comments
Kuldeep Yadav Key Comments : వన్డే ప్రపంచకప్‌లో టీమ్ఇండియా వరుస విజయాలతో సెమీస్‌కు దూసుకువెళ్లింది. లీగ్ స్టేజీలో ఆడిన అన్ని మ్యాచుల్లోనూ గెలుపొందింది. ఓటమే ఎరుగని జట్టుగా సెమీ ఫైనల్‌లో అడుగుపెట్టింది. సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో తలపడనుంది. బుధవారం వాంఖడే వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వాంఖడేలో బౌలర్లకు సవాల్ తప్పదన్నాడు.
‘ఈ మెగాటోర్నీలో వాంఖడే మైదానంలో జరిగిన మ్యాచుల్లో బ్యాటర్లు ఆధిపత్యం చెలాయించారు. ఇక్కడ బౌలర్లకు కాస్త కష్టమే. టీ20 మ్యాచ్‌లో ఒక్కసారి లయ కోల్పోయితే మళ్లీ అందుకోవడం కష్టం. అదే వన్డేల్లో మాత్రం చాలా సమయం ఉంటుంది. వాంఖడేలో విజయం సాధించాలంటే ఆరంభంలోనే వికెట్లు తీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉంటుంది.’ అని కుల్దీప్ యాదప్ అన్నాడు.
CWC 2023: వరల్డ్ కప్ 20 ఏళ్ల నాటి రికార్డు.. బ్రేక్ చేసేదెవరో?
చాలా సిరీస్‌లు ఆడాము..
2019 వన్డే ప్రపంచకప్ సెమీ ఫైనల్‌లో సైతం భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడిన సంగతి తెలిసిందే. అప్పుడు కివీస్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీనిపై కుల్దీప్ యాదవ్ స్పందించాడు. అది నాలుగేళ్ల క్రితం జరిగిన మ్యాచ్. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము చాలా సిరీస్‌లు ఆడాడు. స్వదేశంలోని పరిస్థితులపై మాకు అవగాహాన ఉంది. అలాగే ప్రత్యర్థులకు కూడా అవగాహన ఉంది. అయితే.. ‘మా సన్నద్ధత చాలా బాగుంది. ఈ మెగాటోర్నీ ఆరంభం నుంచి మంచి క్రికెట్ ఆడుతున్నాం. తదుపరి మ్యాచ్‌లోనూ మరోసారి అదే ప్రదర్శనను పునరావృతం చేయాలని భావిస్తున్నాము.’ అని కుల్దీప్ చెప్పాడు.
నాకౌట్ మ్యాచుల్లో ఉండే ఒత్తిడిని తగ్గించుకుని, తన బలాబలాలపై దృష్టి సారిస్తానని అన్నాడు. ఈ ప్రపంచకప్‌లో కుల్దీప్ యాదవ్ 4.15 ఎకానమీతో 14 వికెట్లు పడగొట్టాడు. భారత విజయాల్లో తన వంతు పాత్ర పోషిస్తున్నాడు.