Shai Hope : భారత్ పై విజయం.. వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్ కీలక వ్యాఖ్యలు..
ఉప్పల్లో భారత్ పై విజయం సాధించిన తరువాత విండీస్ కెప్టెన్ షై హోప్ (Shai Hope) కీలక వ్యాఖ్యలు చేశాడు.
Shai Hope Comments after West Indies Beat India 4th T20 Match In Uppal
Shai Hope : ఉప్పల్ వేదికగా బుధవారం భారత్తో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్లో వెస్టిండీస్ 24 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. తద్వారా ఐదు మ్యాచ్ల సిరీస్ను ప్రస్తుతానికి 2-2తో సమం చేసింది. ఇక తమ జట్టు నాలుగో టీ20 మ్యాచ్లో విజయం సాధించడం పట్ల వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. బెంగళూరులో జరిగే చివరి మ్యాచ్లో సిరీస్ గెలుస్తామనే ధీమాను వ్యక్తం చేశాడు.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. విండీస్ బ్యాటర్లలో కెప్టెన్ షై హోప్ (102నాటౌట్; 50 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్సర్లు) సెంచరీ చేశాడు. షెర్ఫేన్ రూథర్ఫోర్డ్ (49 నాటౌట్; 26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు), రోవ్మన్ పావెల్ (24; 17 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), షిమ్రాన్ హెట్మైర్ (33; 12 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించారు. టీమ్ఇండియా బౌలర్లలో అర్ష్దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, అక్షర్ పటేల్ లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
ఆ తరువాత సంజూ శాంసన్ (56; 23 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేయగా.. తిలక్ వర్మ (43; 25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు), నితీశ్ కుమార్ రెడ్డి (41; 20 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్లు) వేగంగా ఆడినప్పటికి కూడా ఇషాన్ కిషన్ (6), శ్రేయస్ అయ్యర్ (16), నమన్ ధీర్ (0), అక్షర్ పటేల్ (3) లు విఫలం కావడంతో 248 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత్ 19.3 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 223 పరుగులకే పరిమితమైంది. ఆఖరిలో అర్ష్దీప్ సింగ్ రిటైర్ హర్ట్(5)గా పెవిలియన్కు చేరడంతో భారత ఇన్నింగ్స్ 3 బంతులు ఉండగానే ముగిసింది.
లగేజీ బరువైపోతుంది..
ఈ మ్యాచ్లో సెంచరీ చేసిన విండీస్ కెప్టెన్ షై హోప్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. కాగా.. భారత పర్యటనలో తాజా దానితో కలిపి మొత్తం మూడు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను షై హోప్ అందుకున్నాడు. దీనిపై సరదాగా స్పందించాడు. నిజం చెప్పాలంటే.. అవి చాలా బరువుగా ఉన్నాయి. లగేజీ బరువును కూడా పరిగణనలోకి తీసుకోవాలి కదా! కాబట్టి.. నేను ఇంటికి తిరిగి వెళ్లేటప్పుడు ఈ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డుల వల్ల కొంత ఇబ్బంది పడతాననిపిస్తోందని నవ్వుతూ షై హోప్ చెప్పాడు.
తన ఇన్నింగ్స్ గురించి మాట్లాడుతూ.. జట్టుకు గెలిచే అవకాశాన్ని కల్పించాలని ప్రయత్నించాను. ప్రారంభంలోనే మంచి పునాది పడింది, ఓపెనింగ్ జోడీ 50కి పైగా పరుగులు జోడించింది. ఇది మాకు చాలా కలిసొచ్చింది. దీనివల్ల మధ్య ఓవర్లలో మరింత స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసే అవకాశం లభించింది. తద్వారా జట్టుకు సాధ్యమైనంత మంచి స్కోరును అందించగలిగాను. అని షై హోప్ తెలిపాడు.
వెస్టిండీస్ సాధించిన స్కోరు సరిపోతుందా అనే దానిపై మాట్లాడుతూ.. నిజాయితీగా చెప్పాలంటే.. అది మంచి స్కోరే అనిపించింది. ఎందుకంటే పిచ్ మేము ఊహించిన దానికంటే భిన్నంగా ప్రవర్తించింది. బంతి అనుకున్నంత వేగంగా బ్యాట్పైకి రాలేదు. కొత్త బంతి కొన్ని సార్లు అసాధారణంగా బౌన్స్ కాగా.. మరికొన్ని సార్లు చాలా తక్కువ ఎత్తులో వచ్చింది. ఆరంభంలో వేగం ఎక్కువగా అనిపించినా.. ఆ తర్వాత స్పిన్నర్లు, పేసర్ల బౌలింగ్లో బంతిని నేరుగా బాదడం కష్టమైంది. కాబట్టి.. 240కి పైగా పరుగులు చేయడం మంచి స్కోరుగానే భావించాను.
రెండు వికెట్లు తీసినప్పటికీ గుడాకేష్ మోటీకి కేవలం రెండు ఓవర్లు మాత్రమే ఇవ్వడంపై మాట్లాడుతూ.. చూడండి భారతదేశంలో బౌలర్లకు వరుసగా మూడు ఓవర్లు ఇవ్వడం ఎప్పుడూ కష్టమే. కొన్నిసార్లు పరిస్థితులను బట్టి ‘సరే, మరో ఓవర్ ఇద్దాం’ అని అనిపించవచ్చు, కానీ కొన్ని సందర్భాల్లో ఒక నిర్ణయం తీసుకుని దానికి కట్టుబడి ఉండాల్సి వస్తుంది. ఈరోజు అలా జరిగింది అంతే.
ఇక రెండు జట్లకు పరిస్థితులు దాదాపు ఒకేలా ఉన్నాయి. మంచు (డ్యూ) ప్రభావం ఉండటం వల్ల, ఛేజింగ్ చేసే జట్టుకు చాలా అడ్వాంటేజ్ అవుతుంది. అయితే.. ఉప్పల్లో డ్యూ లేదు. ఏది ఏమైనప్పటికి.. ఇది చాలా మంచి క్రికెట్ మ్యాచ్. ప్రత్యర్థి జట్టు కూడా అన్ని దశల్లోనూ అద్భుతంగా ఆడింది. కాబట్టి వారికి మనం గుర్తింపు ఇవ్వాలి. అయితే.. ఈ మ్యాచ్లో గెలిచి బెంగళూరులో సిరీస్ గెలిచే అవకాశాన్ని చేజిక్కించుకోవడం చాలా బాగుంది అని షై హోప్ అన్నాడు.
