Shikhar Dhawan disappoints on Nepal Premier League debut
టీమ్ఇండియా మాజీ ఆటగాడు శిఖర్ ధావన్ నేపాల్ ప్రీమియర్ లీగ్‌లో నిరాశపరిచాడు. ఎన్‌పిఎల్‌లో తన తొలి మ్యాచ్ ఆడుతున్న ధావన్ తక్కువ పరుగులకే పెవిలియన్ చేరుకున్నాడు. కర్నాలీ యాక్స్ కు ధావన్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
సోమవారం జనక్‌పూర్ బోల్ట్స్, కర్నాలీ యాక్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో కర్నాలీ యాక్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఆ జట్టు ఓపెనర్‌గా శిఖర్ ధావన్ బరిలోకి దిగాడు. మొత్తంగా 14 బంతులను ఎదుర్కొన్న ధావన్ 3 ఫోర్లు బాది 14 పరుగులు చేసి ఆఫ్ స్పిన్నర్ హర్ష్ థాకర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయి పెవిలియన్‌కు చేరుకున్నాడు.
ధావన్ తక్కువ పరుగులకే ఔటైనా అర్జున్ ఘర్తి (33), గుల్సన్ ఝా (36) లు రాణించడంతో కర్నాలీ యాక్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో జనక్‌పూర్ బోల్ట్స్ బ్యాటర్లు ధాటిగా ఆడుతున్నారు. 10 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 85 పరుగులు చేసింది. అనిల్ షా (44), లహిరు మిలంత (1) లు క్రీజులో ఉన్నారు. జనక్‌పూర్ బోల్ట్స్ విజయానికి 60 బంతుల్లో 57 పరుగులు అవసరం.
ఇదిలా ఉంటే.. ఐపీఎల్ 2024 అనంతరం శిఖర్ ధావన్ అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతడు విదేశాల్లోని టోర్నీల్లో ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే నేపాల్ ప్రీమియర్ లీగ్‌లో తొలి సారి ఆడుతున్నాడు. తొలి మ్యాచులో తక్కువ స్కోరుకే ఔటై అయ్యాడు.
ఇక టీమ్ఇండియా తరుపున 34 టెస్టుల్లో 2315 పరుగులు, 167 వన్డేల్లో 6793 పరుగులు, 68 టీ20ల్లో 1759 పరుగులు సాధించాడు. ఐపీఎల్‌లో 222 మ్యాచుల్లో 6769 పరుగులు చేశాడు.