Shreyas Iyer : వైభవ్ సూర్యవంశీ ఒక్కడి వల్లే గెలవలేదు.. మరో హీరో కూడా ఉన్నాడు.. శ్రేయస్ అయ్యర్ కామెంట్స్..
ఎట్టకేలకు టీమ్ఇండియా టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) తొలి విజయాన్ని అందుకున్నాడు.
- Thota Vamshi Kumar
- Updated on- July 24, 2026 / 08:26 AM IST
Shreyas Iyer comments after Team India win the 1st t20 match against Zimbabwe
Shreyas Iyer : ఎట్టకేలకు టీమ్ఇండియా టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ తొలి విజయాన్ని అందుకున్నాడు. ఏడు మ్యాచ్‌ల్లో దక్కని విజయం ఎనిమిదో మ్యాచ్‌లో అతడిని వరించింది. గురువారం జింబాబ్వేతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. వైభవ్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో పాటు మయాంక్ యాదవ్ అద్వితీయమైన బౌలింగ్ ప్రదర్శన కారణంగానే తాము విజయం సాధించామని మ్యాచ్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ చేసిన జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. జింబాబ్వే బ్యాటర్లలో వెస్లీ మధెవెరె (34 బంతుల్లో 39 పరుగులు) రాణించాడు. టీమ్ఇండియా బౌలర్లలో మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్‌లు చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. శివమ్ దూబె, రవిబిష్ణోయ్‌లు తలా ఓ వికెట్ సాధించారు.
ఆ తరువాత వైభవ్ సూర్యవంశీ (50; 19 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర హాఫ్ సెంచరీ బాదడంతో 126 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ 13.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. టీమ్ఇండియా బ్యాటర్లలో ఇషాన్ కిషన్ (24 బంతుల్లో 35 పరుగులు), శ్రేయస్ అయ్యర్ (24 బంతుల్లో 28 నాటౌట్) రాణించారు. జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ ముజరబాని రెండు వికెట్లు పడగొట్టాడు.
ఇంతకంటే సంతోషం మరొకటి లేదు..
మ్యాచ్ అనంతరం శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. టీమ్ఇండియా కెప్టెన్‌గా తొలి విజయాన్ని అందుకోవడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఇంతకంటే సంతోషకరమైన విషయం మరొకటి లేదన్నాడు. తాను ముందే చెప్పినట్లుగా పిచ్‌లో బౌన్స్ ఉందన్నాడు. ముఖ్యంగా హార్డ్ లెంగ్త్‌లో మంచి బౌన్స్ లభించిందన్నాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ పిచ్ దాదాపుగా ఒకే విధంగా ఉందన్నాడు.
రీ ఎంట్రీలో మయాంక్ యాదవ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడని చెప్పుకొచ్చాడు. లైన్ అండ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేస్తూ బ్యాటర్లకు పరుగులు తీసే అవకాశం ఇవ్వలేదన్నాడు. ఆ తర్వాత లక్ష్య ఛేదనలో పవర్‌ప్లేలో వైభవ్ సూర్యవంశీ వచ్చి అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడన్నాడు.
Vaibhav Sooryavanshi : వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డు.. బుడ్డోడా నువ్వు మామూలోడివి కాదురా..
జింబాబ్వేను ఆలౌట్ చేయలేకపోవడంపై మాట్లాడుతూ.. ప్రతి జట్టులోనూ జట్టును చివరి వరకు తీసుకెళ్లి, మంచి స్కోరును నమోదు చేసే బ్యాటర్ ఒకరు ఉంటారు. వాళ్లు పిచ్ పరిస్థితులను సరిగ్గా అంచనా వేశారని, మంచి భాగస్వామ్యాలను నెలకొల్పారని అన్నాడు. తాను మాత్రం బౌలర్లు అందరిని రొటేట్ చేశానని చెప్పుకొచ్చాడు. ఎందుకంటే తాము ఇదే మైదానంలో మరో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉందని, అందుకనే ఇక్కడి పరిస్థితులకు అందరు బౌలర్లు అలవాటు పడాలని భావించానని తెలిపాడు.
వైభవ్ సూర్యవంశీ పై ప్రశంసల వర్షం కురిపించాడు. అతడు చాలా బాగా ఆడానని అన్నాడు. అతడికి భయం అంటే ఏంటో తెలియని చెప్పుకొచ్చాడు. అతడు ఆడిన తీరు అసాధారణం అని అన్నాడు. ఇక్కడి పిచ్‌లపై అతడికి మంచి అవగాహన ఉందన్నాడు. అండర్ 19 ఫైనల్‌లో ఇదే మైదానంలో అతడు 175 పరుగులు చేశాడనే విషయాన్ని మరిచిపోకూడదని తెలిపాడు. కాబట్టి మైదానంలో అడుగుపెట్టినప్పటి నుంచే అతడు ఆత్మవిశ్వాసంతో కనిపించాడని తెలిపాడు. అతడిని బ్యాటింగ్‌ను చూడడం చాలా బాగుందన్నాడు. సిరీస్‌కు ఇది మంచి శుభారంభం అని శ్రేయస్ అయ్యర్ తెలిపాడు.
