Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా సాగుతోంది. చెన్నై సూపర్ కింగ్స్ పై విజయంతో పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో టాప్-2 స్థానానికి దూసుకువచ్చింది. బుధవారం చెపాక్ మైదానంలో చెన్నై పై పంజాబ్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఈమ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 19.2 ఓవర్లలో 190 పరుగులకు ఆలౌటైంది. అనంతరం శ్రేయస్ అయ్యర్ (72; 41 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు), ప్రభ్ సిమ్రాన్ సింగ్ (54; 36 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీలు బాదడంతో పంజాబ్ 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది.
చెన్నైపై విజయం సాధించడం పట్ల పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆనందం వ్యక్తం చేశాడు. ఎలాంటి మైదానంలోనైనా సరే లక్ష్యాన్ని ఛేదించడం అంటే చాలా ఇష్టం అని తెలిపాడు. భారీ లక్ష్యం ఉన్నప్పుడు బాధ్యత తీసుకోవడం, ఆ తరువాత వచ్చే బ్యాటర్లకు మూమెంటం ఇవ్వడం తనకు ఇష్టం అని చెప్పాడు.
CSK vs PBKS : పంజాబ్ చేతిలో ఓటమి.. చెన్నై కెప్టెన్ ధోని కామెంట్స్ వైరల్.. అందుకే ఓడిపోయాం..
మ్యాచ్ అనంతరం అయ్యర్ మాట్లాడుతూ.. నా నైపుణ్యాలను మెరుగుపరచుకుంటూ, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం నా ధోరణి. బయటి మైదానాల్లో ఆడేటప్పుడు నా ఫామ్ గురించి ఎక్కువగా ఆలోచించను. వీలైనంత వరకు ఆటను ఆస్వాదిస్తూ ఉంటాను. వర్తమానంలో ఉంటూ ప్రతి బంతిని బాదేందుకు ప్రయత్నిస్తుంటాను. లక్ష్యం పెద్దది అయితే.. బయటి స్టేడియంలోనైనా, హోం గ్రౌండ్‌లోనైనా నా ఆట మారదు. దూకుడు ఆడడం కొన్ని సార్లు వర్కౌట్ అవుతుంది. మరికొన్ని సార్లు కాదు. నేను ఒక్కసారి క్రీజులో కుదురుకుంటే ఎంతటి లక్ష్యాన్ని అయినా ఛేదించవచ్చునన్న నమ్మకం ఉంది.’ అని అన్నాడు.
ఇటీవల తాను నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ‘కొత్త బంతితో చాలా వేగంగా బంతులు వేసే బౌలర్లను ఎదుర్కొంటున్నాను. దీని వల్ల నాలో ఎంతో ఆత్మవిశ్వాసం పెరిగింది. నా బ్యాటింగ్ పై దృష్టి పెట్టి ఎక్కువగా శ్రమిస్తున్నాను. నేను నాలుగు ముఖ్యమైన విషయాలను అనుసరిస్తాను. అవి ఆటపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ఈ మైదానంలో బ్యాటింగ్ చేయడం కన్నా ఫీల్డింగ్ చేయడం చాలా కష్టంగా అనిపించింది. లాంగ్-ఆన్ నుండి లాంగ్-ఆన్ వరకు పరుగులు పెట్టాల్సి వచ్చింది. ఇప్పటి వరకు ఆడిన మైదానాలతో పోలిస్తే ఇక్కడ తేమ మరింత ఎక్కువగా అనిపించింది.’ అని శ్రేయస్ చెప్పాడు.
ప్రభ్, ప్రియాంష్ అద్భుతమైన ఆరంభాలను అందిస్తున్నారు. ఇద్దరూ కూడా ధాటిగా ఆడుతూ తదుపరి వచ్చే బ్యాటర్లపై ఒత్తిడి తగ్గిస్తున్నారు. వారు ఇదే జోరును కొనసాగిస్తారని ఆశిస్తున్నాను అని శ్రేయస్ తెలిపాడు.