CSK : ప్లేఆఫ్స్ రేసు నుంచి అఫీషియల్‌గా చెన్నై ఔట్.. ఆర్‌సీబీ, కేకేఆర్, రాజస్థాన్, గుజరాత్‌లకు కొత్త టెన్షన్..
ఐపీఎల్ 2025 సీజన్‌లో అధికారికంగా ప్లేఆఫ్స్ రేసుకు దూరమైంది చెన్నై సూపర్ కింగ్స్.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో అధికారికంగా ప్లేఆఫ్స్ రేసుకు దూరమైంది చెన్నై సూపర్ కింగ్స్. బుధవారం చెపాక్ వేదికగా పంజాబ్ కింగ్స్ చేతిలో ఓడిపోయింది. ఈ సీజన్‌లో చెన్నైకి ఇది 8వ ఓటమి కావడం గమనార్హం. ఇప్పటి వరకు చెన్నై 10 మ్యాచ్‌లు ఆడగా కేవలం రెండు మ్యాచ్‌ల్లోనే విజయం సాధించింది. లీగ్ దశలో చెన్నై మరో నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచినా, ఓడినా కూడా ఇప్పుడు చెన్నైకి వచ్చిన నష్టం లేదు.
ఆందోళనలో బెంగళూరు, కేకేఆర్, రాజస్థాన్, గుజరాత్..
ప్లేఆఫ్స్ రేసులో ఉంటామా ఉండమా అన్న టెన్షన్ ఇప్పుడు చెన్నైకి లేదు. ఈ సమయంలో మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో సీఎస్‌కే జట్టు చాలా స్వేచ్ఛగా ఆడే అవకాశం ఉంది. ఈ సమయంలో ఆటగాళ్లు అత్యుత్తమ ప్రదర్శన చేసే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ప్లేఆఫ్స్ నుంచి దూరం కావడంతో కనీసం మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచి ఫ్యాన్స్‌ను కాస్త సంతోష పెట్టాలని సీఎస్‌కే ఆలోచిస్తూ ఉంటుంది. అదే జరిగితే.. అప్పుడు మిగిలిన జట్ల ప్లేఆఫ్స్ ఛాన్స్‌లు దెబ్బతింటాయి.
CSK vs PBKS : పంజాబ్ చేతిలో ఓటమి.. చెన్నై కెప్టెన్ ధోని కామెంట్స్ వైరల్.. అందుకే ఓడిపోయాం..
మే 3న ఆర్‌సీబీతో, మే 7న కేకేఆర్‌తో, మే 12న రాజస్థాన్‌తో, మే18న గుజరాత్‌తో చెన్నై సూపర్ కింగ్స్ ఆడనుంది. ఈ మ్యాచ్‌ల్లో గనుక చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధిస్తే అది ఆయా జట్ల ప్లేఆఫ్స్ అవకాశాల పై ప్రభావం చూపించవచ్చు.
ఆర్‌సీబీ..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు ఆడింది. 7 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 14 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇంకో నాలుగు మ్యాచ్‌లు ఆడనుంది. ఇందులో కనీసం రెండు మ్యాచ్‌ల్లో గెలిచినా కూడా ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది.
అయితే.. ఇక్కడ ఆర్‌సీబీకి చెన్నైతో మ్యాచ్ ఎందుకు ముఖ్యమంటే.. పాయింట్ల పట్టికలో టాప్-2లో నిలిచిన జట్లకు ఉన్న అడ్వాంటేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఫైనల్ చేరుకునేందుకు టాప్-2 జట్లకు రెండు అవకాశాలు ఉంటాయి. అదే 3, 4 స్థానాల్లో నిలిచిన జట్లకు ఇలాంటి అవకాశం ఉండదు. టాప్-2తో ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టాలంటే చెన్నైని ఆర్‌సీబీ ఓడించాల్సి ఉంటుంది.
కేకేఆర్..
కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు ఆడింది. కేవలం నాలుగు మ్యాచ్‌ల్లోనే గెలిచింది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. ఆ జట్టు ఖాతాలో 9 పాయింట్లు ఉన్నాయి. లీగ్ దశలో మరో నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ నాలుగు మ్యాచ్‌ల్లోనే విజయం సాధిస్తేనే ఆ జట్టు ప్లేఆఫ్స్ చేరుకునేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇందులో చెన్నైతో మ్యాచ్ కూడా ఉంది. ఇప్పుడు చెన్నై పై ప్లేఆఫ్స్ ఒత్తిడి లేదు. ఇప్పుడు ఇదే కేకేఆర్‌కు ప్రతికూలంగా మారనుంది. చెన్నైతో మ్యాచ్‌లో కేకేఆర్ ఓడిపోతే ఆజట్టు ప్లేఆఫ్స్ అవకాశాలను గట్టిగానే ప్రభావితం చేస్తుంది
రాజస్థాన్..
ఈ సీజన్‌లో ఇప్పటి వరకు రాజస్థాన్ 10 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 3 మ్యాచ్‌ల్లోనే గెలిచింది. ఆ జట్టు ఖాతాలో ఆరు పాయింట్లు ఉన్నాయి. లీగ్ దశలో ఆ జట్టు ఇంకో నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ నాలుగు మ్యాచ్‌ల్లో గెలిస్తే ఆ జట్టు ప్లేఆఫ్స్ రేసులో ఉంటుంది. అయితే.. అది మిగిలిన జట్ల సమీకరణాలపై ఆధారపడి ఉంది. చెన్నైతో మ్యాచ్‌లో ఆర్ఆర్ ఓడిపోతే ఆ జట్టు ఇంటి ముఖం పట్టాల్సిందే.
గుజరాత్..
గుజరాత్ టైటాన్స్ ఇప్పటి వరకు తొమ్మిది మ్యాచ్‌లు ఆడగా 6 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఇంకో 5 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇందులో కనీసం మూడు మ్యాచ్‌లు గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా ఆ జట్టు ప్లేఆఫ్స్‌లో అడుగుపెడుతుంది. అయితే.. టాప్-2లో నిలవాలంటే మాత్రం చెన్నైతో మ్యాచ్ కూడా గుజరాత్ కు కీలకమే.