pic credit @mufaddal_vohra
ఐపీఎల్ 2025 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ అదరగొడుతోంది. వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. సోమవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 39 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. ఈ సీజన్‌లో గుజరాత్‌కు ఇది ఆరో విజయం కావడం విశేషం.
ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన అనంతరం గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పొట్టి ఫార్మాట్‌లో పర్‌ఫెక్ట్ గేమ్ ఆడడం చాలా కష్టమన్నాడు. మ్యాచ్‌ల్లో తప్పులు జరగడం సహజం అని చెప్పుకొచ్చాడు. తప్పులు చేసినా విజయాలు సాధించాలని, ఆ విషయంలో తాము ఎంతో మెరుగ్గా ఉన్నామన్నాడు. కేకేఆర్ ఆటగాడు వెంకటేష్ అయ్యర్ ఔటైనప్పుడు భావోద్వేగాలను అదుపుచేసుకోలేకపోయినట్లుగా తెలిపాడు.
KKR vs GT : అందుకే మేము ఓడిపోతున్నాం.. గుజరాత్ పై ఓటమి తరువాత రహానే కీలక వ్యాఖ్యలు..
వరుసగా రెండు మ్యాచ్‌లు గెలవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నాడు. ఈ రెండు మ్యాచ్‌లే పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని శాసిస్తాయని మ్యాచ్‌లకు ముందే అనుకున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఇక ముందు కూడా ఇలాంటి ప్రదర్శననే కొనసాగించాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. చివరి వరకు ఓ బ్యాటర్ క్రీజులో ఉండాలనే విషయాన్ని తాము మాట్లాడుకోలేదన్నాడు. కేవలం ఇలాంటి పరిస్థితుల్లో పరుగులు ఎలా చేయాలన్న దానిపైనే మాత్రమే చర్చించుకున్నట్లుగా తెలిపాడు.
మ్యాచ్‌లో పై చేయి సాధించడం ఓ ఎత్తు అయితే.. మ్యాచ్‌ను ఘనంగా ముగించడం మరో ఎత్తు అని గిల్ అన్నాడు. టీ20లో పర్‌ఫెక్ట్ గేమ్ ఆడడం కష్టమని, ఈ మ్యాచ్‌లోనూ 10 పరుగులు తక్కువగా చేశామన్నాడు. తాను క్రీజులో ఉండి ఉంటే ఆ రన్స్ వచ్చేవన్నాడు. ‘బౌలింగ్‌లోనూ కొన్ని తప్పిదాలు జరిగాయి. అయితే.. ఇక్కడ ఓ విషయం గుర్తుంచుకోవాలి. మీరు పర్‌ఫెక్ట్ గేమ్ ఆడకపోయినా.. గెలవడానికి మార్గాన్ని కనుగొనాలి. ఆ విషయంలో మేం చాలా మెరుగ్గా ఉన్నాం.’ అని గిల్ అన్నాడు.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్ (90; 55 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. సాయి సుదర్శన్ (52; 36 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్) హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. జోస్ బట్లర్ (41 నాటౌట్; 23 బంతుల్లో 8 ఫోర్లు) మెరుపులు మెరిపించారు.
అనంతరం అజింక్యా రహానే (50; 36 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీతో రాణించినా మిగిలిన వారు విఫలం కావడంతో కేకేఆర్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులకే పరిమితమైంది.