KKR vs GT : కేకేఆర్ కెప్టెన్ రహానే కామెంట్స్.. ఈ సీజన్‌లో మేం ఓడిపోవడానికి కారణం అదే..
గుజరాత్ టైటాన్స్ పై ఓటమి తరువాత కేకేఆర్ కెప్టెన్ రహానే కీలక వ్యాఖ్యలు చేశాడు.

pic credit @mufaddal_vohra
ఐపీఎల్ 2025 సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. వరుస ఓటములతో ఆ జట్టు సతమతమవుతోంది. ఈ సీజన్‌లో ఐదో ఓటమిని చవిచూసింది. సోమవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 39 పరుగుల తేడాతో ఓడిపోయింది. బౌలర్లు రాణించినా బ్యాటర్లు చేతులెత్తేశారు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో శుభ్‌మన్ గిల్ (90; 55 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు), సాయి సుదర్శన్ (52; 36 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. జోస్ బట్లర్ (41 నాటౌట్; 23 బంతుల్లో 8 ఫోర్లు) వేగంగా ఆడాడు.
అనంతరం అజింక్యా రహానే (50; 36 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీతో రాణించినా మిగిలిన వారు విఫలం కావడంతో కోల్‌కతా నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులకే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో ఓడిపోవడంతో కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానే నిరాశను వ్యక్తం చేశాడు.
మ్యాచ్ అనంతరం రహానే మాట్లాడుతూ.. ‘199 పరుగుల లక్ష్యాన్ని ఛేదించొచ్చు. బౌలర్లు ఆఖరల్లో చాలా అద్భుతంగా బంతులు వేశారు. భారీ లక్ష్యాన్ని ఛేదించేటప్పుడు ఓపెనర్లు శుభారంభం అందించాలి. దురదృష్టవశాత్తు ఈ సీజన్‌లో మంచి ఆరంభాలను పొందలేకపోతున్నాం. అందుకే ఈ టోర్నమెంట్‌లో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాము.’ అని రహానే అన్నాడు.
వీలైనంత త్వరగా ఓటముల నుంచి పాఠాలు నేర్చుకుని తప్పులను సరిద్దుకుని ముందుకు సాగాలన్నాడు. ‘వాస్తవానికి పిచ్ కొంచెం నెమ్మదిగా ఉంది. దీంతో ప్రత్యర్థిని 200 కంటే తక్కువకు కట్టడి చేస్తే ఛేదించవచ్చునని భావించాం. బౌలర్లు అలాగే చేశారు. అయితే.. బ్యాటింగ్‌లో విఫలం అయ్యాము. ఇక్కడి పరిస్థితులపై ఓ అవగాహన ఉంది. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో మెరుగ్గా బ్యాటింగ్ చేయాలి. అదే మా లోపం.’ అని రహానె తెలిపాడు.
బౌలర్లు చాలా బాగా బంతులు వేశారు. మైదానంలో 10 నుంచి 15 పరుగులు కాపాడుకోగలిగితే అది జట్టుకు ఎంతో మంచిది. బ్యాటర్లు పాజిటివ్ మైండ్ సెట్‌తో బరిలోకి దిగాలి. వారికి పూర్తి మద్దతు ఇస్తాము. చివర్లో రఘువంశీ చాలా చక్కగా ఆడాడు అని రహానే తెలిపాడు.