SRH : ఇలాంటి ఆటగాడిని ఎవరైనా వదులుకుంటారా? షమీకి బదులు అతడిని తీసుకుని ఉండే సన్‌రైజర్స్ పరిస్థితి ఇంకోలా..
ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రయాణం ఏమంత గొప్పగా లేదు.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రయాణం ఏమంత గొప్పగా లేదు. తొలి మ్యాచ్‌లో అద్భుత విజయంతో టోర్నీని ఆరంభించిన ఆ జట్టు ఆ తరువాత చతికిలపడింది. ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు రెండు మ్యాచ్‌ల్లోనే విజయం సాధించింది. మరో 5 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఆ జట్టు ఖాతాలో 4 పాయింట్లు ఉన్నాయి. నెట్‌రన్‌రేట్ -1.217గా ఉంది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం సన్‌రైజర్స్ తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది.
ఈ క్రమంలో ఆ జట్టు పై విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా స్టార్ ఆటగాడు మహ్మద్ షమీ పై ఆ జట్టు అభిమానులు మండిపడుతున్నారు. ఎన్నో ఆశలతో తీసుకుంటే అతడు కనీసం ప్రభావం చూపించడం లేదని అంటున్నారు. ఎన్నో ఏళ్లుగా జట్టుతో ఉన్న ఆటగాడిని అనవసరంగా వేలానికి విడిచిపెట్టిందని, షమీకి బదులుగా వేలంలో అతడిని దక్కించుకుని ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని అభిప్రాయపడుతున్నారు.
ఒకప్పుడు సన్‌రైజర్స్ కు బౌలింగే బలం. భువనేశ్వర్ కుమార్ చాన్నాళ్ల పాటు ఆ జట్టు బౌలింగ్ దళాన్ని ముందుండి నడిపించాడు. ఎన్నో సార్లు స్వల్ప భువీ ఒంటి చేత్తో విజయాలను అందించాడు. ఆరంభ ఓవర్లలోనే కాక డెత్ ఓవర్లలోనూ తనదైన స్వింగ్‌తో బ్యాటర్లకు చుక్కలు చూపించేవాడు.
2011లో పుణే వారియర్స్ తరుపున ఐపీఎల్‌లో అరంగ్రేటం చేశాడు భువనేశ్వర్ కుమార్. తొలి మూడు సీజన్లు ఆ జట్టు తరుపున ఆడాడు. 2014లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో చేరాడు. అప్పటి నుంచి 2024 వరకు అతడు సన్‌రైజర్స్ కు ప్రాతినిథ్యం వహించాడు. ఆ జట్టులో కీలక ప్లేయర్‌గా ఎదిగాడు.
అలాంటి ఆటగాడిని సన్‌రైజర్స్ ఐపీఎల్ 2025 మెగావేలానికి విడిచిపెట్టింది. దీంతో అతడిని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు రూ.10.75 కోట్లకు దక్కించుకుంది. ఇప్పటి వరకు ఈ సీజన్‌లో ఏడు మ్యాచ్‌లు ఆడిన భువీ 7.73 ఎకానమీతో 8 వికెట్లు తీశాడు. ఆర్‌సీబీ వరుస విజయాల్లో తనవంతు పాత్ర పోషిస్తున్నాడు.
మరోవైపు భువీని వద్దుకున్న సన్‌రైజర్స్.. టీమ్ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీని రూ.10 కోట్లు వెచ్చించి మరీ దక్కించుకుంది. అయితే.. షమీ అంచనాలను అందుకోవడంతో విఫలం అయ్యాడు. 7 మ్యాచ్‌ల్లో 5 వికెట్లు మాత్రమే తీశాడు. ఎకానమీ 10.88గా ఉంది.