south africa vs namibia
south africa vs namibia : అంతర్జాతీయ టీ20 క్రికెట్లో పెను సంచలనం నమోదైంది. టీ20 వరల్డ్ కప్ -2024 రన్నరప్ దక్షిణాఫ్రికా జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. క్రికెట్లో పసికూన జట్టుగా పేరున్న నమీబియా జట్టు సఫారీ జట్టును చిత్తుచిత్తుగా ఓడించింది. నమీబియా బౌలర్ల దాటికి సఫారీ జట్టు బ్యాటర్లు క్రీజులో నిలబడలేక పోయారు. టపటపా వికెట్లు పడిపోయాయి.. మరోవైపు నమీబియా జట్టు బ్యాటింగ్‌లోనూ అదరగొట్టింది. ఫలితంగా దక్షిణాఫ్రికా జట్టును చిత్తుచేసి అంతర్జాతీయ టీ20 క్రికెట్లో పెను సంచలనాన్ని నమోదు చేసింది.
విండ్‌హోక్ వేదికగా దక్షిణాఫ్రికా వర్సెస్ నమీబియా జట్ల మధ్య ఏకైక టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో నమీబియాను చిత్తుచిత్తుగా ఓడిద్దామనుకున్న దక్షిణాఫ్రికా జట్టు ఆటగాళ్లకు నమీబియా ప్లేయర్లు దిమ్మతిరిగే షాకిచ్చారు. అద్భుత ఆటతీరుతో దక్షిణాఫ్రికా జట్టును చిత్తు చేశారు.
Also Read: IND vs WI : వెస్టిండీస్‌తో రెండో టెస్టు.. యశస్వి, గిల్ భారీ శతకాలు.. భారత్ 518/5 డిక్లేర్డ్..
తొలుత దక్షిణాఫ్రికా జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది. భారీ స్కోర్ కొట్టేందుకు బరిలోకి దిగిన ఆ జట్టు ఆటగాళ్లకు నమీబియా బౌలర్లు అద్భుతమైన బంతులతో షాక్‌ల మీద షాక్‌లు ఇచ్చారు. రిటైర్మెంట్ వెనక్కి తీసుకొని తిరిగొచ్చిన క్వింటన్ డికాక్ (1) తీవ్ర నిరాశపర్చాడు. అతడితోపాటు స్టార్ బ్యాటర్లు రీజా హెండ్రిక్స్ (7), ఫెరారీ (4) వెంటవెంటనే ఔట్ అయ్యారు. జే స్మిత్ (31), హెర్మన్ (23), ఫోర్టిన్ (19) కొద్దిసేపు క్రీజులో నిలదొక్కుకొని పరుగులు రాబట్టారు. దీంతో నిర్ణీత ఓవర్లలో దక్షిణాఫ్రికా జట్టు ఎనిమిది వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది. నమీబియా బౌలర్లలో రుబెన్ ట్రంపుల్‌మ్యూన్ మూడు వికెట్లు పడగొట్టగా.. మ్యాక్స్ హీంగో రెండు వికెట్లు పడగొట్టాడు.
135 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన నమీబియా జట్టు ప్రారంభంలో తడబడినా చివరికి ఆరు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. నమీబియా బ్యాటర్లలో గెర్హార్డ్ ఎరాస్మస్ (21), కుర్గర్ (18), ట్రంపెల్మాన్ (11) కీలక ఇన్నింగ్స్ లు ఆడారు. అయితే, నమీబియా జట్టు విజయానికి చివరి ఓవర్లో 11 పరుగులు చేయాల్సి వచ్చింది. వికెట్ కీపర్ బ్యాటర్ జేన్ గ్రీన్ (30 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్‌తో తన జట్టుకు చారిత్రత్మక విజయాన్ని అందించాడు.
చివరి ఓవర్లో తొలి బంతికి సిక్స్ బాది నమీబియా వైపు మ్యాచ్‌ను తిప్పేశాడు. చివరి బంతికి ఫోర్ బాది మ్యాచ్‌ను విజయవంతంగా పూర్తి చేశాడు. దీంతో నమీబియా జట్టు ఆటగాళ్ల సంబురాలకు అవధులు లేకుండా పోయాయి.. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
THE HISTORIC MOMENT…!!! 😍
– Namibia Defeated South Africa in the T20I, Winning celebration was emotional. pic.twitter.com/uboCiwnOdE
— Johns. (@CricCrazyJohns) October 11, 2025
నమీబియా ఇటీవలే టీ20 ప్రపంచ కప్ -2026కు అర్హత సాధించింది. కాగా.. ఓ అసోసియేట్ సభ్యదేశం చేతిలో సౌతాఫ్రికా టీ20 మ్యాచ్‌లో ఓడిపోవడం ఇదే తొలిసారి.
2022లో బులవాయోలో జింబాబ్వేను ఓడించిన తర్వాత నమీబియా టీ20 ఫార్మాట్లో చివరి బంతికి గెలవడం ఇది రెండోసారి.
ఐర్లాండ్, జింబాబ్వే, శ్రీలంక తర్వాత టీ20 ఫార్మాట్లో నమీబియాపై ఓడిన నాల్గవ పూర్తి సభ్యదేశం దక్షిణాఫ్రికా జట్టు కావడం గమనార్హం.
2022 ప్రపంచ కప్‌లో అడిలైడ్‌లో నెదర్లాండ్స్ చేతిలో ఓడిపోయిన తర్వాత దక్షిణాఫ్రికా టీ20ల్లో ఒక అసోసియేట్ దేశం చేతిలో ఓడిపోవడం ఇది రెండోసారి.
మ్యాచ్ అనంతరం దక్షిణాఫ్రికా కెప్టెన్ డోనోవస్ ఫెర్రీరా మాట్లాడుతూ.. ఇది మేము కోరుకున్న ఫలితం కాదు. సరే.. మొదట బ్యాట్‌తో మేము మంచి స్కోరు చేయలేక పోయాం. ఆ తరువాత బౌలింగ్‌లోనూ ఆశించిన స్థాయిలో రాణించలేదు. కొన్నికొన్ని సార్లు ఇలాంటి ఫలితాలు చవిచూడాల్సి వస్తుంది. ఆ ఫలితాల నుంచి గుణపాఠాలు నేర్చుకొని మిగిలిన మ్యాచ్‌లలో మెరుగైన ఆటతీరును కనబర్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పాడు.