Image Credit - (Delhi Capitals/X) and @BCCIWomen
మహిళల వన్డే ట్రై-సిరీస్‌లో భాగంగా ఇవాళ కొలంబోలో మొదటి మ్యాచ్ జరుగుతోంది. భారత్ – శ్రీలంక మహిళా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచు ద్వారా ఇద్దరు భారత మహిళా క్రికెటర్లు ఆరంగేట్రం చేశారు.
శ్రీ చరణి, కాశ్వీ గౌతమ్ తమ మొట్టమొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్నారు. వారికి అభినందనలు తెలుపుతూ బీసీసీఐ పోస్ట్ చేసింది. వీరిలో శ్రీ చరణి (20) తెలుగు అమ్మాయి.
కడప జిల్లాకు చెందిన శ్రీ చరణి ఇటీవలి దేశవాలీ మ్యాచుల్లో బాగా రాణించింది. దీంతో శ్రీలంకలో జరుగుతున్న ట్రై-సిరీస్ టోర్నమెంట్‌కు ఆమెను ఎంపిక చేశారు. విమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ఆమె ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున కేవలం రెండు మ్యాచుల్లోనే ఆడి, నాలుగు వికెట్లు పడగొట్టింది. దీంతో ఆమె సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించింది.
Also Read: ఇంగ్లాండ్ పర్యటనకు ఈ నలుగురు ఆల్ రౌండర్లు? హార్దిక్ పాండ్యాకు నో ఛాన్స్?
శ్రీ చరణి స్వస్థలం కడప జిల్లా వీరపునాయుని పల్లి మండలం ఎర్రమల్లె గ్రామం. ఆమె తండ్రి పేరు చంద్రశేఖర్ రెడ్డి. రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్నారు. ఐపీఎల్‌లో రాణించిన శ్రీ చరణి ఇప్పుడు జాతీయ జట్టులో చోటు సంపాదించడంతో ఆమె గ్రామం మొత్తం సంబరాలు చేసుకుంటోంది.
శ్రీ చరణి బౌలింగ్ మాత్రమే కాదు.. బ్యాటింగ్ కూడా అద్భుతంగా చేస్తుంది. గత ఏడాది అక్టోబర్ 22న వడోదరలో గోవా మహిళల జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఆమె 18 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టి, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది.
ఆమె ఎడమచేతి వాటం బ్యాటర్. ఆమె తన టీ20 కెరీర్‌లో 131.3 స్ట్రైక్ రేట్‌తో 84 పరుగులు చేసింది. అత్యధిక స్కోరు 22. ఆమె కెరీర్‌లో 14 బౌండరీలు, ఒక సిక్స్ బాదింది. అవకాశం వచ్చినప్పుడల్లా బ్యాటింగ్‌లోనూ రాణిస్తోంది.
కాగా, ప్రస్తుతం కొలంబోలో జరుగుతున్న మహిళల ట్రై-నేషన్ సిరీస్‌లో భారత్, శ్రీలంక, దక్షిణాఫ్రికా ఆడుతున్నాయి. ఈ టోర్నమెంట్ ఏప్రిల్ 27 నుంచి మే 11 వరకు కొలంబోలోని ఆర్.ప్రీమాడాసా స్టేడియంలో జరుగుతుంది. ప్రతి జట్టు నాలుగు మ్యాచ్‌లు ఆడతాయి.
Say hello to #TeamIndia‘s Debutants! 👋
Congratulations to Sree Charani and Kashvee Gautam 👏👏
Updates ▶️ https://t.co/nET6V3RqM5#WomensTriNationSeries2025 | #SLvIND pic.twitter.com/iB0puwVZ6n
— BCCI Women (@BCCIWomen) April 27, 2025