IND vs ENG: ఇంగ్లాండ్ పర్యటనకు ఈ నలుగురు ఆల్ రౌండర్లు? హార్దిక్ పాండ్యాకు నో ఛాన్స్?
ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (2025–2027)లో భాగంగా 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లాండ్‌లో భారత్ పర్యటించబోతుంది.

ఐపీఎల్ 2025 ముగిశాక జూన్‌లో టీమిండియా ఇంగ్లాండ్‌లో పర్యటించాల్సి ఉంది. గత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో టీమిండియా ఇంగ్లాండ్‌లో జాగ్రత్తలు తీసుకుని ఆడాలని భావిస్తోంది.
గతంలో జరిగిన తప్పులు మళ్లీ జరగకుండా చూసుకోవాలని ప్రణాళికలు వేసుకుంటోంది. ఇంగ్లాండ్ పర్యటన కోసం భారత కోచ్ గౌతమ్ గంభీర్ నలుగురు ఆల్ రౌండర్లను ఎంచుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఆల్ రౌండర్ ఆటగాళ్లలో హార్దిక్ పాండ్యా పేరులేదు. గౌతమ్ గంభీర్ ఎంచుకున్న ఆల్‌రౌండర్లలో రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి, శార్దూల్ ఠాకూర్ ఉన్నారు.
రవీంద్ర జడేజా
టెస్ట్ ఫార్మాట్‌లో రవీంద్ర జడేజా అన్ని వేళలా అద్భుతంగా రాణిస్తాడు. అతడు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లడం పూర్తిగా ఖాయమని అందరూ భావిస్తున్నారు. అతను గత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా ఆడాడు. ఇంగ్లాండ్‌పై అతడికి మంచి రికార్డు ఉంది.
వాషింగ్టన్ సుందర్
టీమిండియా యువ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ టీమ్ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలోనూ తన బౌలింగ్, బ్యాటింగ్‌తో మ్యాచ్ విజయ అవకాశాలను మార్చే సామర్థ్యం ఉన్న ఆటగాడు. ఇంగ్లాండ్ పర్యటనలో వాషింగ్టన్ సుందర్‌ను ఉంటే భారత జట్టుకు ఎన్నో ఉపయోగాలుంటాయి.
నితీశ్ కుమార్ రెడ్డి
గత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో నితీశ్ కుమార్ రెడ్డి అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించాడు. దీంతో టీమిండియాలో అత్యుత్తమ ఆల్ రౌండర్లలో ఒకడిగా వెలుగొందుతున్నాడు. అందుకే నితీశ్ కుమార్ రెడ్డిని ఇంగ్లాండ్ పర్యటనలో ఆడించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అతను ఐదు టెస్ట్ మ్యాచ్‌ల్లో 298 పరుగులు చేసి, 5 వికెట్లు కూడా తీసుకున్నాడు.
శార్దూల్ ఠాకూర్
శార్దూల్ ఠాకూర్ టీమిండియాలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా ఉన్నాడు. టీమ్ క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో వికెట్లు తీయగలడు. అలాగే, బ్యాటింగ్‌తో తన వంతు సహకారం అందిస్తాడు. 11 టెస్ట్ మ్యాచ్‌లలో 31 వికెట్లు తీశాడు. దీంతో అతడు ఇంగ్లాండ్ పర్యటనలో ఆడతాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (2025–2027)లో భాగంగా 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లాండ్‌లో భారత్ పర్యటించబోతుంది. రోహిత్ శర్మ కెప్టెన్‌గా కొనసాగుతాడని భావిస్తున్నారు. స్క్వాడ్ ను మేలో అధికారికంగా ప్రకటిస్తారు.