SriLanka batters single digit scores
SriLanka batters : క్రికెట్‌లో టీమ్ఇండియా బలం ఏంటి..? కొన్నాళ్ల క్రితం వరకు కూడా బ్యాటింగ్ అనే వాళ్లు. స్వదేశంలో అయితే స్పిన్ బౌలింగ్ అని చెప్పేవాళ్లు. అయితే.. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ప్రపంచంలో అత్యుత్తమ ఫాస్ట్ బౌలింగ్ దళాలలో ఒకటిగా ఎదిగింది భారత జట్టు. ప్రత్యర్థి ఎవరైనా సరే చుక్కలు చూపిస్తున్నారు. మరీ ముఖ్యంగా శ్రీలంక అంటే చాలు రెచ్చిపోతున్నారు.
ఇప్పుడున్న నిబంధనలు, మారుతున్న ఆటతీరు వల్ల పసికూన జట్టు అయినా సరే వంద పరుగులు చేస్తుంది. అయితే.. ఒకప్పటి వన్డే ప్రపంచకప్ ఛాంపియన్ అయిన శ్రీలంక మాత్రం భారత్‌తో మ్యాచ్ అంటేనే భయపడిపోతుంది. 11 మంది ఆటగాళ్లు కలిసి కూడా 100 పరుగులు చేయలేకపోతున్నారు. వన్డే ప్రపంచకప్‌లో భాగంగా గురువారం వాఖండే వేదికగా భారత్, శ్రీలంక జట్లు తలపడ్డాయి.
ODI World Cup 2023 : శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ ల ఆన్ ఫీల్డ్ ప్రేమ.. మీమ్స్ వైరల్
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో భారత పేసర్ల ధాటికి శ్రీలంక 19.4 ఓవర్లలో 55 పరుగులకే కుప్పకూలింది. ఐదుగురు బ్యాటర్లు డకౌట్లు అయ్యారు.
ఫోన్ నంబర్‌లను తలపిస్తున్న శ్రీలంక బ్యాటింగ్ స్కోరు కార్డు..
వాంఖడేలో శ్రీలంక జట్టు స్కోరు కార్డు.. 0, 0, 1, 0, 1, 12, 0, 0, 12, 14, 5 చూస్తుంటే ఏదో ఫోన్ నంబర్ ను తలపిస్తోంది. గత మ్యాచ్‌లోనూ కాదు అంతకముందు ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లోనూ ఇదే పరిస్థితి. ఆ మ్యాచ్‌లో 50 పరుగులకే లంక ఆలౌటైంది. ఆ మ్యాచ్‌లో స్కోరు కార్డు 2, 0, 17, 0, 0, 4, 0, 8, 13, 1, 0 ఇదీ. ఈ ఏడాది జనవరిలో తిరువనంత పురం వేదికగా జరిగిన మ్యాచులోనూ లంక బ్యాటర్లు విఫలం అయ్యారు. 73 పరుగులకే ఆలౌటైయ్యారు. 1, 19, 4, 1, 1, 1, 1, 3, 13, 9, 0 ఆ మ్యాచ్‌లో స్కోరు ఇదీ.
భారత బౌలర్లను ఎదుర్కొన లేక లంక బ్యాటర్లలో ఒక్కరు ఇద్దరు మినహా మిగిలిన వారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితం అవుతుండడంతో వారి స్కోరు కార్డులు ఫోన్ నంబర్లను తలపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్‌గా మారింది.