Sunil Gavaskar comments on Suryakumar Yadav not coming out to bat against Oman
Sunil Gavaskar : ఆసియా కప్ 2025 గ్రూప్ దశలో భాగంగా శుక్రవారం భారత్ ఒమన్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో భారత్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయినప్పటికి కూడా ఓ అంశం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. భారత జట్టు ఎనిమిది వికెట్లు కోల్పోయినా కూడా టీమ్ఇండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం బ్యాటింగ్‌కు రాలేదు. ఆఖరికి బౌలర్లు అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్‌లు కూడా క్రీజులో అడుగుపెట్టినా.. సూర్య రాకపోవడంపై పెద్ద ఎత్తున చర్చే నడుస్తోంది.
దీనిపై టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) స్పందించాడు. సూర్య కనీసం ఒక్క ఓవర్ అయినా ఆడి ఉంటే చాలా బాగుండేదన్నాడు. అతడు కొన్ని ఫోర్లు, సిక్సర్లు కొట్టి ఉండేవాడు అని అభిప్రాయపడ్డాడు. అయితే.. పాక్‌తో మ్యాచ్‌లో అతడు బ్యాటింగ్ చేసిన విధానాన్ని పరిగణలోకి తీసుకుంటే అతడికి బ్యాటింగ్ ప్రాక్టీస్ అవసరం లేకపోవచ్చునని అన్నాడు.
సూపర్-4 దశలో మ్యాచ్‌లు ఉత్కంఠగా సాగే అవకాశం ఉందని, అక్కడ భారత్ త్వరగా వికెట్లు చేజార్చుకుంటే కుల్దీప్ యాదవ్ బ్యాటింగ్ సైతం ఉపయోగపడుతుందని సూర్య భావించి ఉంటాడని, అందుకనే ఒమన్‌తో మ్యాచ్‌లో కుల్దీప్‌ను పంపి ఉండాడని గవాస్కర్ తెలిపాడు.
సూర్య నాయకత్వ లక్షణాలను మెచ్చుకున్న సూర్య..
సూర్యకుమార్ యాదవ్ నాయకత్వ లక్షణాలను సునీల్ గవాస్కర్ మెచ్చుకున్నాడు. గతేడాది శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్‌ను ఉదాహరణగా చెప్పాడు. నాటి మ్యాచ్‌లో డెత్ ఓవర్లలో సూర్య స్వయంగా బౌలింగ్ చేయడంతో పాటు బ్యాటర్ రింకూ సింగ్ చేత ఓ ఓవర్ వేయించిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు.
IND vs PAK : పాక్‌తో మ్యాచ్‌కు ముందు భారత్‌కు భారీ షాక్.. గాయపడిన స్టార్ ఆల్‌రౌండర్..!
‘నాటి మ్యాచ్‌లో ఓ దశలో లంక గెలుస్తుందని అనిపించింది. అయితే.. సూర్య చాలా చక్కగా ఆలోచించాడు. స్వయంగా అతడితో పాటు రింకూ సింగ్ లు చెరో ఓవర్‌ను వేశారు. దెబ్బకు మ్యాచ్ గమనం మారిపోయింది. భారత్ విజేతగా నిలిచింది. అదే విధంగా.. సూపర్-4 మ్యాచ్‌లను దృష్టిలో ఉంచుకుని కుల్దీప్, అర్ష్‌దీప్ సింగ్‌లను పంపి ఉంటాడు.’ అని గవాస్కర్ అన్నాడు.