లార్డ్స్ టెస్టు మ్యాచ్‌లో ఐదో రోజు ఆటలో భారత్ గెలవాలంటే మరో 135 పరుగులు అవసరం కాగా.. చేతిలో ఆరు వికెట్లు ఉన్నాయి. అయితే.. తొలి సెషన్ ముగిసే సమయానికి ఆ లక్ష్యం కూడా పెద్దగా కనిపించింది. జడ్డూ పోరాడినప్పటికి టీమ్ఇండియా 74.5 ఓవర్లలో 170 పరుగులకు కుప్పకూలింది. దీంతో టీమ్ఇండియా 22 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇంగ్లాండ్ బౌలర్లలో కెప్టెన్ బెన్‌స్టోక్స్, జోఫ్రా ఆర్చర్‌లు చెరో మూడు వికెట్లు తీశారు. బ్రైడాన్ కార్స్ రెండు వికెట్లు పడగొట్టాడు.
ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (61 నాటౌట్; 181 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటం చేసినా.. మిగిలిన బ్యాటర్లు విఫలం కావడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. ఈ విజయంతో ఇంగ్లాండ్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది.
కాగా.. ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా ఓటమిపై భారత మాజీ దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ స్పందించాడు. మెరుగైన భాగస్వామ్యాలను నమోదు చేయకపోవడమే భారత జట్టు కొంపముంచిదని చెప్పాడు.
భారత రెండో ఇన్నింగ్స్‌లో కనీసం ఒక్కటైన 60 నుంచి 70 పరుగుల భాగస్వామ్యం నమోదు అయి ఉంటే అప్పుడు ఫలితం మరోలా ఉండేదన్నాడు. అయితే.. అది జరగలేదన్నాడు. ముఖ్యంగా స్పిన్నర్లు జోరూట్, షోయబ్ బషీర్‌లు బౌలింగ్ చేస్తున్నప్పుడు జడేజా కొంత రిస్క్ తీసుకుని ఆడాల్సి ఉండేదని అందరూ అంటున్నారు. అయితే.. అతడి పోరాటానికి మాత్రం పూర్తి మార్కులు ఇవ్వాలన్నాడు.
ఇక మ్యాచ్‌లో ఓడిపోవడం పై శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. ఓటమి బాధించిందని చెప్పుకొచ్చాడు. అయినప్పటికి ఆఖరి వరకు పోరాడిన ఆటగాళ్లను అభినందించాడు. టాపార్డర్ లో ఒకటి లేదా రెండు 50 పరుగుల భాగస్వామ్యాలు నమోదు అయి ఉంటే ఫలితం మరోలా ఉండేదన్నాడు. జడేజా అద్భుతంగా ఆడాడని చెప్పుకొచ్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో పంత్ రనౌట్ మ్యాచ్‌ను మలుపుతిప్పిందన్నాడు.