Sunil Gavaskar Fires on players after Team india lost 1st test to england
ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో హెడింగ్లీ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. ఈ క్రమంలో ఇంగ్లాండ్ జట్టు సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. ఈ క్రమంలో భారత జట్టు ఆటతీరుపై విమర్శలు వస్తున్నాయి. ఆటగాళ్ల ఉదాసీనత వల్లే గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ ఓడిపోయిందని పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఇక టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ సైతం తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు.
భారత బ్యాటర్లు ఐదు శతకాలు చేసినప్పటికి కూడా మ్యాచ్ ఓడిపోవడంపై మండిపడ్డాడు. టీమ్ఇండియా క్లాస్ ఆట ఆడలేదని, టెస్ట్ మ్యాచ్ ఆడే విధానం ఇది కాదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్‌లో గెలిచిన ఇంగ్లాండ్ జట్టుకే గెలుపు క్రెడిట్ దక్కుతుందన్నాడు.
‘టీమ్ఇండియా ప్లేయర్లు ఐదు శతకాలు బాదారు. అయినప్పటికి ఇంగ్లాండ్ ఆటగాళ్లు మాత్రం తామే గెలుస్తామన్న ఆత్మవిశ్వాసంతో మ్యాచ్ ఆడారు. చివరికి వారు అనుకున్నది సాధించారు.’ అని గవాస్కర్ అన్నారు. ఇక ఈ మ్యాచ్‌లో గెలిచే అవకాశాలను భారత జట్టు వదులుకుందని మండిపడ్డారు. ఫీల్డర్లు క్యాచ్‌లు వదిలివేయడంతో గెలుపు అవకాశాలు తగ్గాయన్నారు. ఇక బౌలర్లు కూడా కొన్ని పరుగులు ఎక్కువగా ఇచ్చారని తెలిపాడు. మొత్తంగా భారత జట్టు టెస్ట్ క్లాస్ ఆట ఆడలేదని చెప్పుకొచ్చాడు.
ఇక హెడింగ్లీ పిచ్ గురించి మాట్లాడుతూ.. ఇది మంచి బ్యాటింగ్ పిచ్ అని చెప్పుకొచ్చాడు. బౌలర్లను నిందించడానికి ఏం లేదన్నాడు. బుమ్రా చాలా బాగా బౌలింగ్ చేశాడని కొనియాడాడు. అతడికి ఇతర బౌలర్ల నుంచి మద్దతు లభించి ఉంటే బాగుండేదని చెప్పుకొచ్చాడు. సిరీస్‌లో పుంజుకోవడానికి అవకాశం ఉందని, ఇది కేవలం తొలి మ్యాచ్ మాత్రమేనని తెలిపాడు.
‘రెండో టెస్టుకు ఎనిమిది రోజుల సమయం ఉంది. ఓ రెండు రోజులు విశ్రాంతి తీసుకుని ఆ తరువాత ఆటగాళ్లు ప్రాక్టీస్‌ను మొదలుపెట్టాలి. ప్లేయర్లు ఆప్షనల్ ప్రాక్టీస్ చట్రం నుంచి బయటకు రావాలని సూచించాడు. దేశం తరుపున ఆడేటప్పుడు అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేలా ప్రాక్టీస్ చేయాలి.’ అని గవాస్కర్ తెలిపాడు.