Sunrisers Hyderabad
Sunrisers Hyderabad: సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) ఈ సారి కూడా ఊసూరుమనిపించింది. ఎన్నో ఆశలతో ఐపీఎల్(IPL) 2023 సీజన్ ఆరంభించిన హైదరాబాద్ మొత్తంగా ఈ సీజన్‌లో 14 మ్యాచులు ఆడింది. ఇందులో నాలుగు అంటే నాలుగు మ్యాచుల్లోనే విజయం సాధించగా మిగిలిన 10 మ్యాచుల్లో ఓడిపోయింది. 8 పాయింట్లతో పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచి ఘోరంగా నిష్క్రమించింది.
ఐపీఎల్ 2023 సీజన్‌ను సన్‌రైజర్స్ వరుసగా రెండు ఓటముతో ఆరంభించింది. అయితే.. ఆ తరువాత రెండు మ్యాచుల్లో వరుసగా గెలిచి అభిమానుల్లో ఆశలు రేపింది. ఈ సీజన్‌లో అభిమానులు ఆనందపడిన దశ ఏదైనా ఉంది అంటే అది ఇదే. ఆ తరువాత గెలుపు సంగతి మరిచిపోయింది. మధ్య మధ్యలో ఏదో ఓదార్పుకు అన్నట్లు మరో రెండు మ్యాచుల్లో గెలిచింది. గత మూడు సీజన్లుగా సన్‌రైజర్స్ పరిస్థితి ఇలాగే ఉంది.
2021 నుంచి దిగజారిన సన్‌రైజర్స్ ప్రదర్శన
2020 సీజన్‌లో మూడో స్థానంలో నిలిచింది సన్‌రైజర్స్. ఆ తరువాత సీజన్ల నుంచి ప్రదర్శన తీసికట్టుగా మారింది. 2021 సీజన్‌లో 8 జట్లు ఆడగా 14 మ్యాచులు ఆడిన సన్‌రైజర్స్ మూడు మ్యాచుల్లోనే గెలిచి ఆఖరి(8వ) స్థానంలో, 2022లో 10 జట్లు ఆడగా 14 మ్యాచులు ఆడిన సన్‌రైజర్స్ ఆరు మ్యాచుల్లో విజయం సాధించి 8వ స్థానంలో, 2023లో 10 జట్లు ఆడగా నాలుగు మ్యాచుల్లో గెలిచి మళ్లీ ఆఖరి(10వ స్థానం) స్థానంలో నిలిచింది.
ఇలా ప్రతీ సీజన్‌కు సన్‌రైజర్స్ ప్రదర్శన దిగజారుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఏదో ఆడుతున్నామా అంటే ఆడుతున్నట్లుగా ఉంది. గెలవాలన్న కసి ఆటగాళ్లలో ఏ కోశానైనా కనిపించలేదు. ఇలా అయితే రానున్న సీజన్లలలో కూడా సన్‌రైజర్స్ నుంచి అద్భుతాలు ఆశించడం అత్యాశే అవుతుంది.
స్టార్ ఆటగాళ్లను కాదనుకుని
అప్పుడెప్పుడో 2016లో డేవిడ్ వార్నర్ సారధ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ టైటిల్ అందుకుంది. ఆ తరువాత మళ్లీ ఇంతకవరకు మరోసారి కప్‌ను ముద్దాడలేదు. ఎందుకనో తెలీదు గానీ ఐపీఎల్ టైటిల్‌ను అందించిన కెప్టెన్ డేవిడ్ వార్నర్ ను వదులుకుంది. ఫామ్ లేమీ అంటూ కివీస్ ఆటగాడు కేన్ విలియమ్ సన్‌ను దూరం చేసుకుంది. ఇలా ఒక్కొ కారణంలో ఒక్కో స్టార్ ఆటగాడిని వదులుకుని, అనామక ప్లేయర్లను వేలంలో కోట్లు పెట్టి కొనుక్కుంది. అలా వేలంలో కోట్లు దక్కించుకున్న ఆటగాళ్లు ఒక్కరు కూడా బాగా ఆడిన దాఖలాలు లేవు.
ఏ మ్యాచుల్లో ఎవరు ఆడతారో..?
ప్రతీ మ్యాచ్‌కు తుది జట్టును మార్చడం సన్‌రైజర్స్ ఆనవాయితీగా కనిపిస్తోంది. వరుసగా నాలుగు ఐదు మ్యాచుల్లో జట్టును మార్చకుండా ఆడించింది లేదు. దాదాపుగా ప్రతీ మ్యాచ్‌కు తుది జట్టును ఛేంజ్ చేస్తూనే ఉంది. ఈ మ్యాచ్‌లో ఉన్న ఆటగాడు ఆ తరువాతి మ్యాచ్‌లో ఉంటాడో లేదో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఆటగాళ్ల నుంచి అత్యుత్తమ ప్రదర్శన ఆశించడం అత్యాశే అవుతుంది. చెన్నై జట్టునే తీసుకుంటే గాయాలైతే మినహా దాదాపుగా ఒకే జట్టుతోనే బరిలోకి దిగుతుంది. అందుకనే ఆ జట్టు దాదాపు ప్రతీ సీజన్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేస్తోంది.
IPL Playoffs: 10లో 4 మిగిలాయ్.. ప్లే ఆఫ్స్ ఇలా.. ఐపీఎల్ విజేత ఎవరో..?
కావ్యా పాప ముఖంలో ఆనందం కోసమన్నా గెలవండయ్యా..!
ఆటగాళ్ల కంటే కూడా సన్‌రైజర్స్ యజమానుల్లో ఒకరైన కావ్య మారన్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. ఆమె ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ సోషల్ మీడియాలో వైరల్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. సన్‌రైజర్స్ ఆడే ప్రతీ మ్యాచ్‌కు వస్తూ జట్టును ఉత్సాహపరుస్తూ ఉంటుంది. ఓడిపోతే బాధపడుతూ గెలిస్తే ఆనందిస్తూ ఉంటుంది. కనీసం కావ్యా మారన్ ముఖంలో ఆనందం కోసమైనా సన్‌రైజర్స్ గెలవాలని కోరుకునే వారు ఉన్నారనడంలో అనడంలో అతిశయోక్తి లేదు.
వచ్చే సీజన్‌లోనైనా
ఇప్పటికైనా ఎక్కడెక్కడ తప్పులు చేశారో గమనించి వాటిని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆటగాళ్లకు వరుసగా అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించాలి. జట్టులో ఉత్సాహవంతమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలి. తుది జట్టు కూర్పు పట్ల జాగ్రత్త వహించాలి. ఇలా అన్నింటిని మార్చుకుని కనీసం వచ్చే సీజన్‌లోనైనా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ టైటిల్ గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు.