Sweet headache for Shubman Gill as T20 WC winners return to Indian team
IND vs ZIM : తొలి టీ20 మ్యాచులో అనూహ్యంగా పరాజయాన్ని పొందిన భారత జట్టు రెండో టీ20లో ఘన విజయాన్ని అందుకుంది. హరారే వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 100 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇక బుధవారం జరగనున్న మూడో టీ20 మ్యాచ్‌లోనూ విజయం సాధించి 5 మ్యాచుల సిరీస్‌లో ఆధిక్యంలోకి దూసుకువెళ్లాలని భారత జట్టు పట్టుదలగా ఉంది. అయితే.. మూడో టీ20 మ్యాచ్‌కు ముందు తుది జట్టును ఎంపిక చేయడం కెప్టెన్ శుభ్‌మన్ గిల్, కోచ్ వీవీఎస్ లక్ష్మణ్‌కు పెద్ద తలనొప్పిగా ఉంది.
ఎందుకంటే.. టీ20 ప్రపంచకప్‌లో భాగమైన యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్‌లతో పాటు ఆల్‌రౌండర్ శివమ్ దూబెలు జింబాబ్వేలోని భారత జట్టుతో కలిశారు. తొలి రెండు టీ20లకు సైతం వీరు ఎంపికైనా ప్రపంచకప్ విన్నింగ్ సెలబ్రేషన్స్ లో వీరు భాగం కావడం, తుఫాన్ కారణంగా వెస్టిండీస్ నుంచి ఆలస్యంగా రావడం వంటి కారణాలతో జట్టుతో చేరలేకపోయారు. వీరిస్థానాల్లో సాయి సుదర్శన్, హర్షిత్ రాణా, జితేశ్ శర్మలను ఎంపిక చేశారు.
ఇప్పుడు సంజు, జైస్వాల్, దూబెలు రావడంతో సాయి సుదర్శన్, హర్షిత్ రాణా, జితేశ్ శర్మలు జట్టును వీడనున్నారు. దీంతో మూడో టీ20 తుది జట్టు కూర్పు కాస్త మారింది. ఓపెనర్‌గా అభిషేశ్ శర్మ సత్తా చాటడం ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. జైస్వాల్ ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడా..? లేదా అతడి బెంచీకే పరిమితం చేస్తారా..? అన్నది ఆసక్తికరంగా మారింది. ధ్రువ్ జురెల్ స్థానంలో సంజూ శాంసన్ కు తుది జట్టులో అవకాశం దక్కనుంది. సాయి సుదర్శన్ స్థానంలో శివమ్ దూబెకి అవకాశం రావొచ్చు. ఒకటి లేదా రెండు మార్పులు మినహా రెండో టీ20 మ్యాచ్‌లోనూ విజయం సాధించిన జట్టుతోనే భారత్ బరిలోకి దిగొచ్చు.
రెండో టీ20 మ్యాచ్ అనంతరం టీమ్ కాంబినేషన్ పై గిల్ స్పందించాడు. ఇది మంచి తలనొప్పే అని అన్నాడు. ఆటగాళ్లను ఎంపిక చేసే ఆప్షన్లు లేకపోవడం కంటే ఎక్కువ మంది ఆటగాళ్లు ఉండటమే మంచిదని చెప్పాడు.
మూడో టీ20కు టీమ్ఇండియా తుది జట్టు అంచనా..
శుభ్‌మన్ గిల్(కెప్టెన్), అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, రియాన్ పరాగ్, శివమ్ దూబే, రింకూ సింగ్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, ఆవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.