BCCI : బీసీసీఐ ప్రైజ్‌మనీ 125 కోట్లను ఆటగాళ్లకు ఎలా పంచారో తెలుసా..? ఎవరు ఎక్కువ అందుకున్నారంటే..?
ప్రపంచకప్ గెలిచిన టీమ్ఇండియా బృందానికి బీసీసీఐ 125 కోట్ల నజరానాగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

PIC credit : BCCI
17 ఏళ్ల తరువాత మరోసారి టీ20 ప్రపంచకప్ విజేతగా భారత జట్టు నిలిచింది. దీంతో దేశ వ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు. ప్రపంచ ఛాంపియన్లుగా నిలిచి వెస్టిండీస్ నుంచి స్వదేశానికి చేరుకున్న భారత జట్టుకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. అనంతరం ముంబైలోని వాంఖడే స్టేడియంలో బీసీసీఐ భారత జట్టు ఆటగాళ్లను సన్మానించింది. అంతేకాకుండా ప్రపంచకప్ గెలిచిన టీమ్ఇండియా బృందానికి 125 కోట్ల నజరానాగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
కాగా.. ఈ ప్రైజ్‌మనీని ఎలా పంచారు. ఎవరికి ఎంత మొత్తం లభించింది అన్న వివరాలను ఓ సారి చూద్దాం..
Abhishek Sharma : ఆ కసితోనే బరిలోకి దిగా.. రికార్డు సెంచరీ తరువాత అభిషేక్ శర్మ కీలక వ్యాఖ్యలు
టీమ్ఇండియా ప్రపంచకప్ కోసం 42 మంది సభ్యుల బృందం వెళ్లింది. ఇందులో 15 మంది ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, రిజర్వ్ ఆటగాళ్లు ఉన్నారు. కాగా.. 125 కోట్లను బీసీసీఐ ఆటగాళ్లకు మాత్రమే కాకుండా సహాయక సిబ్బందికి కూడా పంపిణీ చేసింది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం.. భారత జట్టులోని 15 మంది సభ్యులకు ఒక్కొ ఆటగాడికి రూ.5 కోట్లు అందించింది. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు సైతం రూ.5 కోట్లు ఇచ్చింది.
బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే లకు రూ.2.5కోట్లు అందించింది. బ్యాక్ రూమ్ స్టాఫ్ సిబ్బంది.. ముగ్గురు ఫిజియోథెరపిస్ట్‌లు, ముగ్గురు త్రోడౌన్ స్పెషలిస్టులు, ఇద్దరు మసాజర్‌లు, స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్‌లకు ఒక్కొక్కరికి రూ.2 కోట్లు అందజేశారు.
అంతేకాకుండా సెలక్షన్ కమిటీ సభ్యులు, రిజర్వ్ ఆటగాళ్లు అయిన రింకూ సింగ్, శుభ్‌మన్ గిల్, అవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్ లకు ఒక్కొక్కరికి కోటి రూపాయలు అందుకున్నారు.