New Zealand vs Uganda : ఎట్టకేలకు న్యూజిలాండ్ జట్టు టీ20 ప్రపంచకప్ 2024లో బోణీ కొట్టింది. ట్రినిడాడ్ వేదికగా శనివారం ఉగాండతో జరిగిన మ్యాచ్‌లో తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కాగా.. ఈ పొట్టి ప్రపంచకప్ నుంచి న్యూజిలాండ్ జట్టు ఇప్పటికే నిష్ర్కమించిన సంగతి తెలిసిందే.
పసికూన ఉగాండా పై కివీస్ విరుచుకుపడింది. తొలుత బౌలింగ్‌లో ఆ తరువాత బ్యాటింగ్‌లో చెలరేగి పలు రికార్డులను నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో ఉగాండా మొదట బ్యాటింగ్ చేసింది. 18.4 ఓవర్లలో 40 పరుగులకు ఆలౌటైంది. టీ20 ప్రపంచకప్‌లో ఇది రెండో అత్యల్ప స్కోరు కావడం గమనార్హం.
ఉగాండా బ్యాటర్లలో కెన్నెత్ వైస్వా (11) ఒక్కడే రెండు అంకెల స్కోరు సాధించగా మిగిలిన అందరూ కూడా సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. కివీస్ బౌలర్లలో టిమ్ సౌథీ మూడు వికెట్లు తీశాడు. ట్రెంట్ బౌల్ట్, మిచెల్ శాంట్నర్, రచిన్ రవీంద్ర లు తలా రెండు వికెట్లు తీశారు.
అనంతరం డేవాన్ కాన్వే (15 బంతుల్లో 22 నాటౌట్) రాణించడంతో వికెట్ కోల్పోయి 5.2 ఓవర్లలో న్యూజిలాండ్ లక్ష్యాన్ని అందుకుంది. బంతుల పరంగా టీ20 ప్రపంచకప్‌లో మూడో అతి పెద్ద విజయాన్ని కివీస్ నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో మరో 88 బంతులు మిగిలి ఉండగానే కివీస్ విజయం సాధించింది.
ఈ పొట్టి ప్రపంచకప్ ఆరంభంలో అఫ్గానిస్తాన్, వెస్టిండీస్ చేతిలో కివీస్ ఓడిపోయింది. అదే సమయంలో ఆడిన మూడు మ్యాచుల్లోనూ విజయాలు సాధించిన విండీస్, అఫ్గాన్ లు జట్లు ఆరు పాయింట్లతో సూపర్ 8 చేరుకున్నాయి. దీంతో కివీస్ కు దారులు మూసుకున్నాయి. ఉగాండాతో మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన కివీస్ తన చివరి లీగ్ మ్యాచ్‌లో పపువా న్యూగినియా పై భారీ విజయాన్ని సాధించినా కూడా ఆ జట్టు పాయింట్లు గరిష్టంగా నాలుగు పాయింట్లకే చేరుకుంటాయి. కాగా.. టీ20 ప్రపంచకప్ చరిత్రలో లీగు దశలోనే న్యూజిలాండ్ నిష్ర్కమించడం ఇదే తొలి సారి.