Afghanistan Cricket: క్రికెట్ విషయంలో తలదూర్చం.. యథేచ్ఛగా ఆడేసుకోండి – తాలిబాన్

అఫ్గానిస్తాన్‌ గడ్డపై తాలిబన్ల పాలన మొదలయ్యాక ప్రతి విషయం ప్రశ్నార్థకంగానే మారింది. జర్నలిస్టుల దగ్గర్నుంచి క్రీడాకారుల వరకూ ఎటువంటి ఆంక్షలు పెడతారోనని అనుమానంతోనే..........

Afghanistan Cricket: క్రికెట్ విషయంలో తలదూర్చం.. యథేచ్ఛగా ఆడేసుకోండి – తాలిబాన్

Afghanistan

Updated On : September 1, 2021 / 4:20 PM IST

Afghanistan Cricket: అఫ్గానిస్తాన్‌ గడ్డపై తాలిబన్ల పాలన మొదలయ్యాక ప్రతి విషయం ప్రశ్నార్థకంగానే మారింది. జర్నలిస్టుల దగ్గర్నుంచి క్రీడాకారుల వరకూ ఎటువంటి ఆంక్షలు పెడతారోనని అనుమానంతోనే ఉన్నారు. అయితే క్రికెటర్లకు, క్రికెట్ లవర్లకు గుడ్ న్యూస్ చెప్పారు తాలిబాన్లు. దేశ క్రికెట్‌ భవిష్యత్తుపై నెలకొన్న సందిగ్ధతను పటాపంచలు చేస్తూ.. తాలిబన్‌ ప్రతినిధి అహ్మదుల్లా వసీఖ్‌ ఓ కీలక ప్రకటన విడుదల చేశారు.

అఫ్గాన్‌ క్రికెట్‌ విషయాల్లో తాలిబన్లు తల దూర్చబోరంటూ స్పష్టమైన హామీ ఇచ్చారు. అంతర్జాతీయ షెడ్యూల్‌ ప్రకారం యథావిధిగానే మ్యాచ్‌లు ఆడుకోవచ్చని, ఎటువంటి అభ్యంతరం ఉండబోదంటూ భరోసా ఇచ్చారు. ప్రపంచ దేశాలతో సత్సంబంధాలు ముఖ్యమని, అఫ్ఘాన్ క్రికెట్‌ జట్టు విదేశీ పర్యటనకు వెళ్లినా, విదేశీ జట్లు తమ దేశానికి వచ్చినా తమకు ఎటువంటి అభ్యంతరాలు, అంతరాయాలు ఉండబోవని స్పష్టం చేశారు.

ఈ క్రమంలోనే నవంబరులో జరగాల్సిన ఆసీస్‌ పర్యటన షెడ్యూల్‌ ప్రకారం యథావిధిగా జరుగుతుందని హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో అఫ్గాన్‌ జట్టు నవంబర్‌ 27న ఆసీస్‌తో ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌లో తలపడబోతుంది. హోబర్ట్‌ వేదికగా జరిగే ఈ చారిత్రక మ్యాచ్‌ కోసం ఏర్పాట్లు ప్రారంభించామని క్రికెట్‌ ఆస్ట్రేలియా సైతం ప్రకటించడం విశేషం. ఇదిలా ఉంటే, అఫ్గాన్‌లో నెల‌కొన్న అనిశ్చిత ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఆ దేశ క్రికెటర్‌ రషీద్‌ ఖాన్‌ వరుస ట్వీట్లతో ఆవేదనను వ్యక్తం చేశారు.

తమ దేశాన్ని కాపాడాలని, అఫ్గాన్ ప్రజలను చంపడం ఆపాలని గతంలో ట్వీట్లు చేశారు. మరోవైపు రషీద్‌ ఖాన్‌, మహమ్మద్ నబీ యూఏఈ వేదికగా జరిగే ఐపీఎల్ 2021 సీజన్ ఆడతారని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఇటీవలే స్పష్టం చేసింది.