Tamim Iqbal rushed to hospital after suffering heart attack during Dhaka Premier League game
బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ గుండెపోటుకు గురైనట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఢాకా ప్రీమియర్ డివిజన్ క్రికెట్ లీగ్ మ్యాచ్ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తున్న క్రమంలో తమీమ్ కు ఛాతీలో నొప్పిరావడంతో ఆస్పత్రికి తరలించారు.
స్థానిక మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. సోమవారం (మార్చి 24) ఢాకా శివార్లలోని సావర్‌లో ఢాకా ప్రీమియర్ డివిజన్ క్రికెట్ లీగ్ లో భాగంగా మొహమ్మదన్ స్పోర్టింగ్ క్లబ్, షైనెపుకుర్ క్రికెట్ క్లబ్ ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తున్న క్రమంలో తమీమ్ కు ఛాతీలో నొప్పి మొదలైంది.
వెంటనే అతడిని హెలికాఫ్టర్ ద్వారా ఢాకా తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే.. అతడిని హెలిప్యాడ్‌కు తీసుకువెలుతున్న సమయంలో ఛాతీలో నొప్పి తీవ్రమైంది. దీంతో వెంటనే అతడిని ఫజిలతున్నేసా ఆస్పత్రికి తరలించారు.
Nitish Kumar Reddy : మ్యాచ్ మధ్యలో పెళ్లి పై స్పందించిన నితీశ్ కుమార్ రెడ్డి.. వీడియో వైరల్..
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) చీఫ్ ఫిజీషియన్ డాక్టర్ దేబాషిష్ చౌదరి మాట్లాడుతూ.. ‘స్థానిక ఆస్పత్రిలో తమీమ్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. తేలికపాటి గుండె సమస్యలు ఉన్నట్లుగా అనుమానం వచ్చింది. ఆయన్ను ఢాకాకు తరలించడానికి ప్రయత్నాలు జరిగాయి. కానీ హెలిప్యాడ్‌కు తీసుకెళ్లే మార్గంలో ఆయనకు తీవ్రమైన ఛాతీ నొప్పి వచ్చింది. వెంటనే తిరిగి తీసుకురావాల్సి వచ్చింది. వైద్య నివేదికల ప్రకారం అది తీవ్రమైన గుండెపోటుగా నిర్థారించారు. అని చెప్పారు.
ప్రస్తుతం ఆయన వైద్యుల పరిశీలనలో ఉన్నారని, అతడు కోలుకునేందుకు వైద్యులు చేయాల్సిన ప్రయత్నాలు అన్ని చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు.
బంగ్లాదేశ్‌కు చెందిన డైలీ స్టార్ నివేదిక ప్రకారం.. తమీమ్ ఇక్బాల్ కు ఉన్న రెండు ధమనులలో ఒకటి 100 శాతం మూసుకుపోయింది. మరొకటి పాక్షికంగా మూసుకుపోయింది. వైద్యులు అతడికి యాంజియోగ్రామ్ చేసినట్లుగా తెలిపింది.